Sakshi News home page

ఎస్వీయూకు అంతర్జాతీయ గుర్తింపు

Published Thu, Sep 22 2016 10:51 PM

ఎస్వీయూనివర్సిటీ పరిపాలన భవనం

 
టైమ్స్‌ ర్యాంకింగ్‌లో చోటు
తిరుపతి, యూనివర్సిటీక్యాంపస్‌ : ఎస్వీయూకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ గురువారం విడుదల చేసిన 2016–17   ర్యాంకింగ్స్‌లో ఎస్వీయూ 601–800 స్లాట్‌లో ర్యాంకు పొంది అరుదైన ఘనత సాధించింది. ఈ సంస్థ నిర్వహించిన నిర్వహించిన సర్వేలో  ప్రపంచంలోని 27వేల యూనివర్సిటీల పనితీరు పరిశీలించి వాటి ఆధారంగా ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకుల జాబితాలో ఎస్వీయూ ప్రపంచస్థాయిలో 601–800 ర్యాంకు స్లాట్‌లో స్థానం పొందింది. భారత దేశ వ్యాప్తంగా 17వ స్థానంలో నిలిచింది. అంతే కాకుండా దక్షిణ భారత దేశంలో ప్రథమ స్థానం పొందింది. జనవరిలో టైమ్స్‌ సంస్థ ర్యాంకింగ్‌ కోసం ఎస్వీయూ అధికారులు దరఖాస్తు చేశారు. యూనివర్సిటీ వివిధ అంశాల్లో సాధించిన ప్రగతి ఆధారంగా దరఖాస్తు చేశారు. దీనికి సంబంధించి గురువారం విడుదల చేసిన ఫలితాల్లో బోధనలో 34.3 మార్కులు, పరిశోధన రంగంలో 11.5  మార్కులు, పారిశ్రామిక అనుబంధరంగాల్లో 32.8  మార్కులు, పరిశోధన జర్నల్స్‌ ప్రచురణ రంగంలో 11.2 మార్కులు సాధించింది. మన దేశంలోని బిట్స్‌ పిలాని, ఐఐటీ గౌహతి, ఐఐటీ రూర్కీ, ఐఐటీ బాంబే, ఐఐటీ కాన్పూర్, కలకత్తా, ఢిల్లీ, పంజాబ్, పూణే విశ్వవిద్యాలయాల సరసన నిలిచింది. ఈ ఏడాది కేంద్ర మానవవనరుల శాఖ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో ఎస్వీయూ జాతీయ స్థాయిలో 63 వ ర్యాంకులో, పరిశోధనలపరంగా 13 వస్థానంలో నిలిచిన సంగతి తెల్సిందే. తాజాగా అరుదైన గుర్తింపును సొంతం చేసుకోవడం విశేషం. 
 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement