తనిఖీ ఉండదు!

20 Oct, 2016 22:01 IST|Sakshi
తనిఖీ ఉండదు!

మాముళ్లు ఇస్తే అక్రమ రవాణాకు రాజమార్గం
చెక్‌పోస్టులు ఉన్నా ప్రయోజనం శూన్యం


వ్యవసాయ ఉత్పత్తులు, విలువైన గ్రానైట్‌ ముడిసరుకును ప్రభుత్వానికి ఎలాంటి రాయల్టీ, పన్నులు చెల్లించకుండానే జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని చెక్‌పోస్టులను అక్రమార్కులు దాటించేస్తున్నారు. మాముళ్లు ఇస్తే సరుకు ఎలాంటిదైనా... ఎంత పరిమాణంలో ఉన్నా... సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రూ. కోట్లు విలువ చేసే గ్రానైట్‌ ముడిసరుకుతో పాటు వరి, వేరుశనగ, పత్తి, మొక్కజొన్న తదితర ధాన్యపు పంటలతో పాటు, ప్రభుత్వం పేదలకు అందజేస్తున్న చౌక బియ్యం రాష్ట్ర సరిహద్దులను దాటిపోతోంది.


కర్ణాటక సరిహద్దున
జిల్లా సరిహద్దులో.. రాయదుర్గం వద్ద ఉభయ రాష్ట్రాల మధ్య గతంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ చెక్‌పోస్ట్‌ను రాజకీయ ఒత్తిళ్లతో ఎత్తివేశారు. ప్రస్తుతం ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులు అక్రమంగా తరలిపోకుండా ఉండేందుకు అగ్రి చెక్‌పోస్ట్‌ మాత్రమే ఉంది. ఎలాంటి తనిఖీలు నిర్వహించకుండానే సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది ఈ చెక్‌పోస్ట్‌ను దాటిపోయేందుకు వాహనదారులకు అనుమతులిస్తున్నారు.
ఇందుకు గాను అధికారులకు బాహటంగానే మాముళ్లు ముట్టచెబుతుండడం గమనార్హం. సరుకు అక్రమ రవాణా ద్వారా ప్రభుత్వ ఖజనాకు భారీగా గండిపడుతోంది.

బయటపడిన భండారం
చెక్‌పోస్ట్‌లో ఎలాంటి తనిఖీలు చేపట్టడం లేదనేందుకు గత ఆగస్ట్‌ 20న 225 బస్తాల చౌక బియ్యం లోడుతో రాష్ట్ర సరిహద్దు దాటిన లారీయే నిదర్శనం. వాహనం చెక్‌పోస్ట్‌ వదకు చేరుకోగానే అందులో ఉన్న సరుకు మొక్కజొన్న అని చెప్పగానే రూ. 1,500 తీసుకుని ఎలాంటి తనిఖీ చేపట్టకుండానే అధికారులు చెక్‌పోస్ట్‌ను దాటించారు. అదే లారీని ఓ వ్యక్తి కర్ణాటక సరిహద్దు పైతోట వద్ద అడ్డుకుని   భండారాన్ని బట్టబయలు చేశాడు.  ఈ విషయం తెలుసుకున్న చెక్‌పోస్ట్‌ సిబ్బంది హడావుడిగా రసీదు రాసి, తమ అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. గత ఆదివారం కర్ణాటకలోని బళ్లారి నుంచి  డి.హీరేహాళ్‌ మీదుగా 330 బస్తాల చౌకబియ్యంతో వెళుతున్న లారీ డ్రైవర్‌తో చెక్‌పోస్ట్‌ సిబ్బంది మాముళ్ల విషయమై ఘర్షణ పడుతుండగా అటుగా వెళుతున్న ఓ కానిస్టేబుల్‌ గమనించి, వాహనాన్ని తనిఖీ చేశాడు. అందులో చౌకబియ్యాన్ని గుర్తించిన అతను వెంటనే తన ఉన్నతాధికారులకు విషయాన్ని చేరవేసి వాహనాన్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.  

బియ్యం ఆంధ్రకు చెందినదే
కర్ణాటక నుంచి తరలిస్తున్నట్టుగా చెప్పబడిన ఆ బియ్యం వాస్తవానికి రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్, కణేకల్లు, రాయదుర్గం ప్రాంతాల నుంచి సేకరించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం బియ్యాన్ని బళ్లారి వద్ద ఉన్న ఆంధ్రాళ్‌లోని గోదాంలో నిల్వచేసి, అక్కడి నుంచి రెండు లారీల్లో ఆదివారం తెల్లవారుజామున తరలించే యత్నం చేశారు.  డి.హీరేహాళ్‌ చెక్‌పోస్టు వద్దకు రాగానే వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సిబ్బంది ముందు వచ్చిన వాహనం డ్రైవర్‌తో భారీ మొత్తంలో మామూళ్లు తీసుకుని వదిలేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. కొంత ఆలస్యంగా వచ్చిన మరొక లారీని ఆపగా, మామూళ్ల విషయం కుదరకపోవడం, పోలీసులు , ప్రజలు గమనించడంతోనే భండారం బహిర్గతమైనట్లు తెలుస్తోంది. దొరికితే దొంగ, లేదంటే దొర అన్న చందంగా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.38 కోట్ల లక్ష్యానికిగాను సెప్టెంబర్‌ మాసాంతానికి కేవలం రూ.20 లక్షలు మాత్రమే వసూలు చేసి, జిల్లాలోనే అధమ స్థానంలో  ఈ చెక్‌పోస్ట్‌ నిలిచింది.   

రెవెన్యూ అధికారుల ఉదాసీనత
అక్రమంగా తరలిపోతున్న పేదల బియ్యం గురించి రెవెన్యూ అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. గత ఆగస్టు 20న మొలకాల్మూరు చెక్‌పోస్టు వద్ద 225 బస్తాల చౌకబియ్యంతో పట్టుబడిన లారీ ఎవరిది, నిందితులు ఎవరు అనే సమాచారాన్ని బహిర్గతం చేయకుండా గోప్యంగా ఉంచారు. 225 బస్తాలు కణేకల్లు స్టాక్‌ పాయింట్‌ నుంచి లోడ్‌ చేసుకుని వచ్చామని పట్టుబడ్డ లారీ యజమాని చెప్పినా చర్యలు మాత్రం శూన్యం. రాజకీయ నేతల ఒత్తిళ్ళ మేరకు ఆ లారీ యజమానిని ఓ రెవెన్యూ ముఖ్య అధికారే జిల్లా అధికారుల వద్దకు తీసుకెళ్లి, కేసును నీరుగార్చినట్లు ఆరోపణలున్నాయి.

రెండు నెలల్లో 20 లారీలు సీజ్‌
గ్రానైట్, స్లాబ్‌ పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు అక్రమంగా తరలిపోకుండా ఉండేందుకు తాడిపత్రి ప్రాంతంలో రెండు నెలల క్రితం నాలుగు చెక్‌పోస్టులను విజిలెన్స్‌ అధికారులు ఏర్పాటు చేశారు. సిబ్బంది కొరతతో ఇక్కడి చెక్‌పోస్టులలో పోలీస్, గనుల శాఖకు చెందిన సిబ్బంది మాత్రమే విధుల్లో ఉంటున్నారంటూ విజిలెన్స్‌ అధికారులు పేర్కొంటున్నారు.  అయితే ఈ చెక్‌పోస్టుల ద్వారా ప్రభుత్వ ఖజనాకు ఎంత మేరకు చేరుతుందో గానీ... అవినీతి అధికారుల బొక్కసాలు మాత్రం నిండిపోతున్నాయి. పెన్నానది పాత వంతెన, కొత్త వంతెన, చుక్కలూరు క్రాస్, భోగసముద్రం వద్ద ఉన్న ఈ చెక్‌పోస్టులలో గనులు, పోలీస్, రవాణ, వాణిజ్య పన్నుల శాఖల అధికారులు 24 గంటలూ పనిచేస్తూ... సరుకు అక్రమంగా తరలిపోకుండా చూడాల్సిన బాధ్యత ఉంది.

ఈ నాలుగు శాఖల అధికారుల ఆమోదం పొందిన తర్వాతనే వాహనాలు చెక్‌పోస్టులు దాటి వెళుతుంటాయి. అక్రమంగా సరుకుతో వెళుతున్న వాహనదారుల నుంచి అపరాధరుసుం వసూలు చేయాల్సిన అధికారులు కాస్తా మాముళ్ల మత్తులో చెక్‌పోస్టు గేట్‌లను ఎత్తి వేస్తున్నారు. చెక్‌పోస్టులు దాటి వెళ్లిన వాహనాలు విజిలెన్స్‌ అధికారుల తనిఖీల్లో పట్టుబడుతున్నాయి. ఈ రెండు నెలల్లో 20కి పైగా వాహనాలను విజిలెన్స్‌ అధికారులు సీజ్‌ చేశారంటే జీరో వ్యాపారం ఎంత స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జీరో వ్యాపారం యథేచ్ఛగా సాగిపోతోందన్న విమర్శలు ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు