పోరాడి ఓడిన టీమిండియా | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన టీమిండియా

Published Thu, Oct 20 2016 9:59 PM

పోరాడి ఓడిన టీమిండియా

న్యూఢిల్లీ: న్యూజిలాండ్ తో రెండో వన్డేలో టీమిండియా పోరాడి ఓడింది. కాగా, ఈ విజయంతో న్యూజిలాండ్ ఐదు వన్డేల సిరీస్ ను 1-1తో సమం చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ కివీస్ ను 242/9 పరుగుల కట్టడి చేసింది. కివీస్ బ్యాట్స్ మన్లలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ 128 బంతుల్లో 118 పరుగులు చేశాడు. అనంతరం 243 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు శుభారంభం అందించడంలో విఫలమయ్యారు.

ఇన్నింగ్స్ 21 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ(15) కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కివీస్ బౌలర్లు విజృంభించడంతో భారత స్కోరు బోర్డు నత్త నడకన కదిలింది. విరాట్ కోహ్లీ(9), అజింక్యారహానే(28), మనీశ్ పాండే(19)లు కూడా త్వరగా ఔట్ అవడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది.

ఆచితూచి ఆడుతూ..
ఆ తర్వాత 73/4 వద్ద క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ధోని, కేదార్ జాదవ్ లు చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ ఇన్నింగ్స్ ను నిర్మించే ప్రయత్నం చేశారు. ఈ దశలో జాదవ్(41) అనవసర షాట్ కు యత్నించి 139/5 వద్ద కీపర్ క్యాచ్ గా వెనుదిరగాడు. దీంతో వీరిద్దరి భాగస్వామ్యనికి తెరపడింది. జాదవ్ ఔటయిన తర్వాత ఆల్ రౌండర్ హర్దిక్ పాండ్యాను వరుసలో వెనుకకు పంపి అక్షర్ ను క్రీజులోకి తీసుకువచ్చాడు ధోని. ఆచితూచి ఆడుతూ అక్షర్ పటేల్ తో కలిసి తిరిగి స్కోరును ముందుకు తీసుకువెళ్తున్న సమయంలో టిమ్ సౌథీ బౌలింగ్ లో అతనికే క్యాచ్ ఇచ్చి 172/6గా ధోని వెనుదిరిగాడు.


ఆశలు కల్పించి..
దీంతో్ న్యూజిలాండ్ తిరిగి మ్యాచ్ పై పట్టు దొరికినట్లయింది. ఆ తర్వాత వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయి మ్యాచ్ ఇండియా చేజారిపోయే దశకు చేరింది. అప్పుడ బ్యాటింగ్ కు వచ్చిన ఉమేశ్ యాదవ్, ఆల్ రౌండర్ హర్ధిక్ పాండ్యాకు అండగా నిలిచాడు. దీంతో మ్యాచ్ తిరిగి ఇండియా చేతికి వచ్చినట్లు కనిపించింది. చివరి ఆరు బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన సమయంలో పాండ్యా(36) క్యాచ్ గా వెనుదిరిగాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బుమ్రాను టిమ్ సౌథీ బౌల్డ్ చేయడంతో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 236 పరుగుల వద్ద టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, గుప్తిల్ బంతితో నిప్పులు చెరిగారు. సౌథీ మూడు వికెట్లను పడగొట్టగా.. బౌల్ట్, గుప్తిల్ లకు చెరో రెండు, హెన్రీ, సాంట్నర్ లకు తలా ఓ వికెట్ దక్కాయి.

Advertisement
Advertisement