పెరిగిన సహజ జలాలు

29 Mar, 2017 22:44 IST|Sakshi
పెరిగిన సహజ జలాలు
 -డెల్టా కాలువలకు సమృద్ధిగా నీరు
-అయినా శివార్లకు తప్పని కొరత
-తోటలు, చెరువులకు మోటార్లతో తోడకమే కారణం
అమలాపురం : ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద సహజ జలాల రాక అనూహ్యంగా పెరుగుతోంది. ఈనెల మొదటివారంలో (6వ తేదీ) 965 క్యూసెక్కులు  ఉన్న సహజ జలాల రాక రెండవ వారం (8వ తేదీ) నాటికి 2,700 క్యూసెక్కులకు పెరిగింది. సోమవారం నాటికి ఇన్‌ఫ్లో 9,828 క్యూసెక్కులకు పెరిగింది. ఒక విధంగా ఇది ఆశ్చర్యకర విషయమే. వేసవి ఎండలు పెరిగిన ఈ సమయంలో ఇన్‌ఫ్లో వెయ్యి క్యూసెక్కుల లోపే ఉంటుంది. అయితే మన్యంలో పలు ప్రాంతాల్లో అడపాదడపా కురుస్తున్న వర్షాలకు ఇన్‌ఫ్లో పెరిగిందని నీటిపారుదల శాఖాధికారులు చెబుతున్నారు. సహజ జలాల రాక పెరగడం వల్ల సీలేరు పవర్‌ డ్రాప్‌ నుంచి వచ్చే నీరు తగ్గినా డెల్టా కాలువలకు అధికారులు సమృద్ధిగా సాగునీరందిస్తున్నారు. సీలేరు నుంచి ప్రస్తుతం 2810.64 క్యూసెక్కుల నీరు వస్తోంది. మొత్తం 12,638.64 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా, డెల్టా కాలువలకు 10,060 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేస్తున్నారు. తూర్పుడెల్టాకు 2,940, మధ్యడెల్టాకు 2,010, పశ్చిమ డెల్టాకు 5,110 క్యూసెక్కుల చొప్పున నీరందిస్తున్నారు. తూర్పు, పశ్చిమ డెల్టాలకు 90 డ్యూటీ (ఒక క్యూసెక్కు 90 ఎకరాలకు చొప్పున), మధ్యడెల్టాకు 86 డ్యూటీలో సాగునీరందిస్తున్నారు. 
కాలువల కట్టివేత గడువు పెంపును ప్రకటించాలి..
 పంట కాలువలకు సమృద్ధిగా సాగునీరందిస్తున్నా.. శివారు, మెరక ప్రాంతాలకు నీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఇందుకు సాగునీటి నిర్వహణా వైఫల్యం ఒక కారణమైతే.. మార్చి 31 నాటికి పంట కాలువలు మూసివేస్తామని అధికారులు చెప్పడం మరొక కారణమని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. 31 నాటికి కాలువలు మూసివేస్తే ఇబ్బందులు తప్పవని కాలువలను ఆనుకుని ఉన్న కొబ్బరితోటలు, ఆక్వా చెరువులు (చేపలు, రొయ్యలు) సాగు చేసే రైతులు మోటార్లతో పెద్ద ఎత్తున నీరు తోడుతున్నారు. తూర్పుడెల్టాలో కె.గంగవరం, తాళ్లరేవు, కాజులూరు, కరప, మధ్యడెల్టాలో ఉప్పలగుప్తం, ముమ్మిడివరం, అయినవిల్లి, ఐ.పోలవరం, కాట్రేనికోన, మలికిపురం, రాజోలు, సఖినేటిపల్లి, పి.గన్నవరం, అమలాపురం మండలాల్లో తోటలకు, చేలకు నీటి తోడకం ఎక్కువగా ఉంది. ఏప్రిల్‌ 15 వరకు నీరు ఇవ్వాల్సి ఉందని తెలిసి కూడా అధికారులు పదేపదే మార్చి 31 నాటికి మూసివేస్తామనడంతో వరిసాగు చేసే శివారు రైతులు అనుకోని నీటి ఎద్దడిని ఎదుర్కొనాల్సి వస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని కాలువలకు గడువు పెంచుతున్నట్టు అధికారులు ప్రకటిస్తే జలచౌర్యం కొంత వరకు తగ్గి తమ చేలకు నీరందుతుందని రైతులు అంటున్నారు. 
మరిన్ని వార్తలు