ఇంద్రకీలాద్రి అంతా దుర్గమ్మకే

26 Mar, 2016 07:00 IST|Sakshi
ఇంద్రకీలాద్రి అంతా దుర్గమ్మకే

♦ 120 ఎకరాల అటవీ భూమి దేవస్థానానికి ఇవ్వాలని నిర్ణయం
♦ ఆ స్థలంలో దేవతా, వనమూలికల చెట్ల పెంపకం
 
 సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై అటవీశాఖ భూమి మొత్తం దుర్గమ్మకు సొంతం కానుంది. ఈ మేరకు అటవీ భూమిని దేవస్థానానికి అప్పగించేందుకుఏపీ సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాస్తవానికి ఇంద్రకీలాద్రి సుమారు 300 ఎకరాల్లో ఉన్నా..దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కేవలం ఏడెనిమిది ఎకరాలకే పరిమితమైంది. మిగిలిన పర్వతమంతా అటవీ శాఖ ఆధీనంలో ఉంది. దీన్ని అటవీశాఖ పట్టించుకోకపోవడంతో చాలా భాగం అన్యాక్రాంతమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిని అటవీ శాఖ కంటే దుర్గగుడి ఆధ్వర్యంలోనే ఉంచడం మంచిదని సీఎం నిర్ణయించారు. ఆ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని దుర్గగుడి ఈవో చంద్రశేఖర్ ఆజాద్ ‘సాక్షి’కి తెలిపారు.

 ప్రస్తుతం ఉన్నది 120 ఎకరాలే
 ఇంద్రకీలాద్రిపై అటవీ శాఖకు ప్రస్తుతం 120 ఎకరాలు మాత్రమే ఉందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. కొండపై ఇప్పటికే కొంతమంది ఇళ్లు నిర్మించుకోవడంతో  చాలా భాగం ఆక్రమణలకు గురయ్యింది. దుర్గగుడి వెనుక నుంచి సైతం ఇళ్ల నిర్మాణం సాగుతోంది. దీంతో ఇప్పటికైనా అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో దేవాలయం భద్రతకే ముప్పు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. దేవస్థానంపై ఉగ్రవాదుల కన్ను ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో కొండ మొత్తాన్నీ దుర్గగుడి ఆధీనంలోకి తేవాలని నిర్ణయించారు.

 అర్జునుడు తపోవనానికి మెట్లు
 అటవీ శాఖ నుంచి తీసుకునే భూమి చుట్టూ రక్షణగోడ కట్టనున్నట్లు ఈవో ఆజాద్ తెలిపారు. సింహాచలంలో ఎనిమిది కిలోమీటర్ల మేర రక్షణ గోడ నిర్మించారని, ఇక్కడ 120 ఎకరాల్లో నిర్మించడం కష్టం కాదన్నారు. అలాగే దేవస్థానం ప్రాంగణంలో శ్రీశైలం, తిరుమల తరహాలో దేవతా, వనమూలికా వృక్షాలు పెంచాలని నిర్ణయించారు. అమ్మవారి పూజలకు అవసరమయ్యే పూల మొక్కలు, చెట్లను పెంచే ఆలోచనలో ఉన్నారు. కొండపై అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశంలోని పురాతన గుడిని అభివృద్ధి చేసి అక్కడికి మెట్ల మార్గం ఏర్పాటు చేయనున్నారు.

 ఈశాన్యంలో కోనేరు...
 దేవాలయానికి తూర్పున ఇప్పటికే భారీ ఎత్తున రాజగోపురం నిర్మించారు. దానికి పక్క గా ఈశాన్యంలో కిందివైపుకోనేరు నిర్మిస్తే.. వాస్తురీత్యా బాగుండటంతో పాటు భక్తుల స్నానాలకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కొండ పైనుంచి కోనేరులో పడేలా కృత్రిమ వాటర్ ఫాల్స్(జలపాతం) ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దీంతో ఈ ప్రాంతం చక్కటి పర్యాటక ప్రాంతంగా మారనుంది.

 ఆదిశంకరుల విగ్రహాలు...
 ఇంద్రకీలాద్రిపై ఘాట్ రోడ్డు వైపు ఆదిశంకరాచార్యులు నలుగురు శిష్యులకు ఉపదేశం చేస్తున్నట్లుండే విగ్రహాలను చెక్కించాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఇంద్రకీలాద్రి అటవీశాఖ ఆధ్వర్యంలో ఉండటంతో ఇది పూర్తిగా సాధ్యపడలేదు. ఇప్పుడు దేవస్థానం ఆధ్వర్యంలోకి వస్తే ఆదిశంకరాచార్యుల విగ్రహాలు జాతీయ రహదారిపై వెళ్లే వారికి కనపడేలా ఏర్పాటుచేయిస్తామని ఈవో ఆజాద్ తెలిపారు.

మరిన్ని వార్తలు