భానుడి ప్రతాపం

12 Mar, 2017 23:05 IST|Sakshi
భానుడి ప్రతాపం

నెల్లూరు(సెంట్రల్‌) : జిల్లాలో భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. మార్చి నెల రెండో వారం నుంచే మాడు పగులుతోంది. మూడు రోజుల నుంచి వరుసగా 34, 35, 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటలు దాటితే ఇంటి నుంచి బయటకు రావడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా పాఠశాలలు, పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు ఎండ వేడిమి తట్టుకోలేక పోతున్నారు.

చాలా చోట్ల పరీక్ష సెంటర్లలో కనీస వసతులు లేక పోవడం మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. జిల్లాలో చాలా చోట్ల ఉపాధి కూలీలు, రోడ్డు పక్కన ఉంటున్న చిరు వ్యాపారులకు ఎండ తీవ్రత చాలా ఇబ్బందికరంగా మారింది. రానున్న రోజులలో ఎండ తీవ్రత మరింతగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో శనివారం పలువురికి వడ దెబ్బ కూడా తగిలింది. భానుడి ప్రతాపం నుంచి తట్టుకోవాలంటే ఎక్కువగా మంచినీరు, చలువ పదార్థాలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు