29 నుంచి బంగారు షాపుల నిరవధిక బంద్

28 Mar, 2016 15:50 IST|Sakshi

నరసరావుపేట వెస్ట్(గుంటూరు జిల్లా): కేంద్ర ప్రభుత్వం బంగారం వ్యాపారంపై విధించిన సెంట్రల్ ఎక్సైజ్ పన్నుకు నిరసనగా ఈనెల 29 నుంచి రాష్ట్రంలో బంగారం వ్యాపారులు నిరవధిక బంద్ చేపడుతున్నట్లు ఏపీ బులియన్, గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్ మర్చంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్ వెల్లడించారు. ఆదివారం గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వర్తక ప్రతినిధుల తృతీయ సమావేశంలో తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయం మేరకు 13 జిల్లాల్లోని వ్యాపారులు తమ షాపులను మూసివేసి బంద్‌లో పాల్గొంటారని ఆయన విలేకరులకు తెలిపారు. బంద్ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఒక రోజు స్థానిక ఎమ్మెల్యేను, మరుసటి రోజు పార్లమెంటు సభ్యులు, ఆ మరుసటి రోజు మంత్రులను ఘెరావ్ వంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.

అర్ధనగ్న ప్రదర్శనలు, కాగడా ప్రదర్శనలు నిర్వహించి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తామన్నారు. ఎక్సైజ్ పన్నును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ స్టేట్ చీఫ్ ఆర్గనైజర్ ఎస్.శాంతిలాల్‌జైన్ మాట్లాడుతూ బంగారం వ్యాపారంపై విధించిన సెంట్రల్ ఎక్సైజ్ పన్నుపై దేశవ్యాప్తంగా గత 25 రోజుల నుంచి వర్తకులు బంద్ చేస్తున్నారన్నారు. ఏపీలో మాత్రం కొన్నాళ్లు బంద్ నిర్వహించి ఆపేశారని, ఇప్పుడు మిగతా రాష్ట్రాల వర్తకులకు మద్దతుగా తాము కూడా పన్నును రద్దు చేసేవరకు బంద్ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు చెప్పారు.

>
మరిన్ని వార్తలు