ఇస్రో ఎదుగుదల దేశానికి గర్వకారణం

9 Oct, 2016 05:15 IST|Sakshi
ఇస్రో ఎదుగుదల దేశానికి గర్వకారణం
  • - కలెక్టర్‌ ముత్యాలరాజు
  •  
    సూళ్లూరుపేట: ఐదు దశాబ్దాల క్రితం ఉపగ్రహాలను తయారు చేసుకొని విదేశాలకు చెందిన రాకెట్ల ద్వారా పంపించే స్థాయి నుంచి విదేశీ ఉపగ్రహాలను మన రాకెట్ల ద్వారా ప్రయోగించే స్థాయికి ఇస్రో ఎదగడం దేశానికే గర్వకారణమని కలెక్టర్‌ ముత్యాలరాజు పేర్కొన్నారు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో శనివారం డీఓఎస్‌ కాలనీ నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వరకు అంతరిక్ష నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని షార్‌ డైరెక్టర్‌ కున్హికృష్ణన్‌ జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ సూళ్ల నుంచి 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రత్యేకంగా తయారు చేసి టీ షర్టులు ఇచ్చారు. ఈస్ట్‌ ఆర్‌ వెస్ట్, ఇస్రో ఈజ్‌ ది బెస్ట్‌  అనే నినాదాలతో ర్యాలీని నిర్వహించారు. ఇస్రో ప్రయోగించిన రాకెట్‌ నమూనాలు, ఉపగ్రహాలను ప్రత్యేక వాహనాల్లో అమర్చి అంతరిక్ష నడకను చేపట్టారు. అనంతరం ప్రభుత్వ హైస్కూల్‌ మైదానంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడారు. అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో భారత శాస్త్రవేత్తలు ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తాను 1995 నుంచి ఐఏఎస్‌ చదవాలని లక్ష్యంగా పెట్టుకొని చదివితే 2007 నాటికి ఆ లక్ష్యాన్ని చేరుకున్నానని చెప్పారు. అనంతరం షార్‌ డైరెక్టర్‌ మాట్లాడారు. 1957 అక్టోబర్‌ 4న మానవ నిర్మిత ఉపగ్రహం స్నుతిక్‌ను తయారు చేశారని, 1967 అక్టోబర్‌ 10న దీన్ని ప్రయోగించడంతో ఐక్యరాజ్య సమితి ఆమోదించి ప్రపంచ వారోత్సవాలుగా ప్రకటించడంతో కార్యక్రమాలను నిర్వస్తున్నామని చెప్పారు. వారం పాటు పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. విద్యార్థులకు ఆవగాహన కల్పించేందుకు రోహిణి – 2 సౌండింగ్‌ రాకెట్లను ప్రయోగించి చూపిస్తున్నామని చెప్పారు. మ్యూజియం, షార్‌ సందర్శనకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. అనంతరం అంతరిక్ష వారోత్సవాలపై వివిధ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు.
     
     
మరిన్ని వార్తలు