జై భవానీ.. జైజై భవానీ !

20 Dec, 2016 22:52 IST|Sakshi
జై భవానీ.. జైజై భవానీ !

చిట్టినగర్‌ : ‘జై భవానీ.. జైజై భవానీ..’ నినాదాలతో వన్‌టౌన్‌ ప్రాంతం మంగళవారం మార్మోగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భవానీలు, భక్తులు అమ్మవారి నామస్మరణ చేస్తూ గిరిప్రదర్శన సాగిస్తున్నారు. భవానీ దీక్ష విరమణలు సందర్భంగా వన్‌టౌన్‌ ప్రాంతంలో పండుగ వాతవరణం నెలకొంది. గిరి ప్రదక్షణ చేసే భవానీలతో ఇంద్రకీలాద్రి చుట్టూ ఆధ్యాత్మిక వాతావరణం కనిపించింది. భవానీలకు స్థానిక వ్యాపారులు, అమ్మవారి భక్తులు మంచినీరు, పాలు, పండ్లు పంపిణీ చేస్తున్నారు. మంగళవారం ఎండ ఎక్కువగా ఉండటంతో సేవా కార్యక్రమాలు తొలి రోజు నుంచే వేగవంతమయ్యాయి.
ట్రాఫిక్‌లో ఇబ్బందులు
కేటీ రోడ్డులోని పాలప్రాజెక్టు నుంచి నెహ్రూ బొమ్మ సెంటర్‌ వరకు ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంది. రోడ్డుకు ఇరువైపులా భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో భవానీలు గిరిప్రదక్షణ కోసం నానా అవస్థలు పడాల్సి వచ్చింది. చిట్టినగర్‌, నెహ్రూబొమ్మ సెంటర్‌లో తరచూ ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో వాహనాల మధ్య నుంచి భవానీలు భయంభయంగా వెళ్లాల్సి వచ్చింది. రోడ్డుకు ఒకవైపు వాహనాలను మళ్లించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తే భవానీలకు ఉపయోగరంగా ఉంటుంది.
భవానీ ఘాట్‌లో ఏర్పాట్లు
భవానీపురం :  భవానీ దీక్షల విరమణను పురస్కరించుకుని భవానీ ఘాట్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఘాట్‌ మెట్ల దిగువున స్టీల్‌ బారికేడ్లను నిర్మిస్తున్నారు. ఘాట్‌ ఆసాంతం ఏర్పాటు చేసిన బారికేడ్ల మధ్య అక్కడక్కడ దారి వదిలారు. ఆ మార్గం నుంచే భక్తులు ఒక క్రమ పద్ధతిలో నదిలో స్నానాలు చేసేలా చూస్తున్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు