ఇక నిరంతర నియామకాలు

24 Aug, 2015 02:12 IST|Sakshi
ఇక నిరంతర నియామకాలు

ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్
* కరీంనగర్‌లో ‘సాక్షి’ నిర్వహించిన  గ్రూప్స్ అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి
* సదస్సుకు అపూర్వ స్పందన
* భారీగా తరలివచ్చిన అభ్యర్థులు
* పైరవీలకు తావు లేదన్న ఈటల
* అభ్యర్థుల సందేహాలకు నిపుణుల సమాధానాలు

కరీంనగర్ సిటీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగాల నియామక ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

‘సాక్షి’ భవిత ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళాభారతిలో ‘గ్రూప్స్’ పరీక్షలపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమైక్య రాష్ట్రంలో మాదిరిగా డబ్బుల్లేవనో, నిషేధముందనో నియామకాల ప్రక్రియను నిలిపివేయబోమని చెప్పారు. హైదరాబాద్‌లో మాదిరిగానే కరీంనగర్‌లో కూడా సదస్సుకు నిరుద్యోగ అభ్యర్థుల నుంచి అపూర్వ స్పందన లభించింది.

జిల్లావాసులతోపాటు ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా నిరుద్యోగులు వేలాదిగా తరలివచ్చారు. దాంతో సదస్సు కిక్కిరిసిపోయింది. లోపల చోటు చాలకపోవడంతో కళాభారతి ఆవరణలో లైవ్ ప్రొజెక్టర్ ద్వారా ఎంతోమంది ఉద్యోగార్థులు కార్యక్రమాన్ని వీక్షించారు. వారిని ఉనుద్దేశించి ఈటల మాట్లాడుతూ... 1969లో తెలంగాణ ఉద్యమం ‘మన  రాష్ట్రం, మన ఉద్యోగాలు’ అనే నినాదంతోనే మొదలైందని గుర్తు చేశారు. ‘‘పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యతను మేం తీసుకున్నాం.

విద్యార్థుల్లేని చోట స్కూళ్లు మూతపడ్డాయి. అవి తప్ప ఇతర ప్రభుత్వ శాఖలన్నింటిలోనూ ఖాళీల భర్తీని చేపడుతూనే ఉంటాం’’ అని వివరించారు. ఉద్యోగార్థులు సంకల్పాన్ని సడలించకుంటే విజయం తథ్యమని ఉద్బోధించారు. ఉద్యోగ నియామకాలకు ప్రతిభ ఒక్కటే కొలమానమని ఈటల స్పష్టం చేశారు. పైరవీలకు, పైసలకు ఎక్కడా తావు లేదన్నారు. రూ.10 లక్షలు, రూ.20 లక్షలు ఇస్తేనే ఉద్యోగం వస్తుందనే ప్రచారాన్ని అభ్యర్థులు నమ్మొద్దన్నారు. అభ్యర్థులు మోసపోవద్దని, దళారులను ఆశ్రయించొద్దని, ప్రతిభనే నమ్ముకోవాలని హితవు పలికారు.

అక్రమాలు చోటుచేసుకొన్నట్టు తేలితే అవసరమైతే ఆ పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించడానికి కూడా వెనకాడబోమన్నారు. అభ్యర్థుల కోసం ‘సాక్షి  దినపత్రిక’ ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. టీఆర్‌ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ మాట్లాడుతూ గ్రూప్స్‌తోనే సరిపెట్టకుండా జిల్లాల అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత పోస్టులను సాధించాలని ఆకాంక్షించారు. సివిల్స్‌పై కూడా ‘సాక్షి’ అవగాహన సదస్సు నిర్వహించాలని సూచించారు. ‘సాక్షి’ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.
 
సందేహాలకు నిపుణుల సమాధానాలు
గ్రూప్స్ పరీక్షల విధానం, సిలబస్, పరీక్షకు సన్నాహకాలకు సంబంధించి ఉద్యోగార్థులు తమ సందేహాలను నిపుణుల ముందుంచారు. పోటీ పరీక్షల్లో తెలంగాణ ఉద్యమ చారిత్రక నేపథ్యం, భౌగోళిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులు కీలకంగా మారడంతో ఎక్కువగా వాటి గురించి ప్రశ్నించారు.

సిలబస్ కమిటీ సభ్యుడు కృష్ణారెడ్డి, జాగ్రఫీ నిపుణుడు, సివిల్స్ సీనియర్ ఫాకల్టీ గురిజాల శ్రీనివాసరావు, చరిత్ర నిపుణుడు లెంకల రామకృష్ణారెడ్డి, ఎకానమీ నిపుణుడు డాక్టర్ కె.ఆర్ రమణ, అర్థమెటిక్, రీజనింగ్ నిపుణుడు మాటూరి లింగమూర్తి, జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణుడు సురుకోంటి మహిపాల్‌రెడ్డి తదితరులు వారి సందేహాలను నివృత్తి చేశారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.
 
నైపుణ్యాలు పెంచుకోవాలి
పోటీ పరీక్షలను ఎదుర్కొనేందుకు అదనపు నైపుణ్యాలు అవసరం. తెలంగాణ అంశాలకు ప్రాధాన్యం పెరగనుంది. రాష్ట్ర వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పూర్వపు హైదరాబాద్ రాష్ట్ర స్థితిగతులు, ఉద్యమం, తెలంగాణ సాధించుకున్న తర్వాతి పరిస్థితులకూ ప్రాధాన్యముంటుంది. తెలంగాణ ఉద్యమ చరిత్రనూ లోతుగా అధ్యయనం చేయాలి.
- కృష్ణారెడ్డి, సిలబస్ కమిటీ సభ్యుడు
 
పక్కా ప్రణాళికతో ముందుకు
గ్రూప్స్ పరీక్షలకు పక్కా ప్రణాళికతో సన్నద్ధం కావాలి. దేశ, తెలంగాణ చరిత్రలపై పట్టు సాధించాలి. సిలబస్‌కు అనుగుణంగా పుస్తకాలు ఎంపిక చేసుకోవాలి. మాదిరి, గత ప్రశ్నపత్రాలను క్షుణ్నంగా సాధన చేయాలి.
- రామకృష్ణారెడ్డి, చరిత్ర నిపుణుడు
 
శాస్త్రీయ కోణంలో చదవాలి
అర్ధశాస్త్రానికి శాస్త్రీయ కోణంలో సన్నద్ధత కావాలి. ఇది స్కోరింగ్ సబ్జెక్ట్ కాదన్నది అపోహే. నిపుణుల సూచనలతో సరిగా చదివితే మార్కులు సాధించడం సులభమే.
- కేఆర్ రమణ, ఆర్థిక శాస్త్ర నిపుణుడు
 
అవగాహన అత్యవసరం
సిలబస్‌లో తెలంగాణ అంశాలను చేర్చడంతో అభ్యర్థుల్లో నెలకొన్న అయోమయాన్ని తొలగించేందుకు ‘సాక్షి’ తలపెట్టిన ఈ సదస్సు ఎంతో దోహదపడుతుంది. అభ్యర్థులు ఇంటర్వ్యూకూ ప్రాధాన్యమివ్వాలి. బట్టీ పట్టకుండా అంశాలవారీ అవగాహనతో ముందుకె ళ్లాలి.
- ఎస్.మహిపాల్‌రెడ్డి, జీకే, నిపుణుడు
 
భిన్నంగా ఆలోచించాలి
ఏ పోటీ పరీక్షకైనా అర్థమెటిక్, రీజినింగ్ కీలక అంశం. గణితశాస్త్రానికి సంబంధం లేని అభ్యర్థులకు ఆందోళన అనవసరం. గత ప్రశ్నపత్రాల సాధన ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చు.         
- ఎంఎల్ మూర్తి, రీజనింగ్ నిపుణుడు
 
సరైన దృక్పథమే విజయానికి నాంది
గ్రామీణ అభ్యర్థుల్లో తెలంగాణ నుంచి పోటీ పెరుగుతుండటం మంచి పరిణామం. సిలబస్‌లో మార్పులున్నా అయోమయపడకుండా నిర్దిష్ట ప్రణాళికతో చదవాలి. రకరకాల పుస్తకాల నుంచి సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలి తప్ప ఒకే పుస్తకంపై ఆధారపడొద్దు.పథకాల వివరాలన్నీ తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో సవివరంగా ఉంటాయి.
- గురజాల శ్రీనివాసరావు, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ

>
మరిన్ని వార్తలు