అర్హులకు సంక్షేమ ఫలాలు

12 Dec, 2016 15:15 IST|Sakshi
అర్హులకు సంక్షేమ ఫలాలు

జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి
నేరడిగొండ :  ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూడడమే ప్రధాన లక్ష్యమని జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని వాగ్ధారి గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించారు. సంక్షేమ ఫలాలు అర్హులకు చేరుతున్నాయా.. లేదా? అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను జేసీకి విన్నవించగా, ఓపికగా ప్రతీ సమస్యకు పరిష్కార  మార్గాలు చూపించారు. సంబంధిత అధికారులు సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

రైతులు, పేదలు, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ సందర్భంగా కొందరు పింఛన్లు రావడం లేదని, రేషన్‌కార్డులు లేవని జేసీకి తెలిపారు. అర్హులకు వెంటనే పింఛన్లు, రేషన్‌కార్డులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతకుముందు మరుగుదొడ్ల నిర్మాణానికి జేసీ భూమిపూజ చేశారు. స్థానిక సర్పంచ్ సిడాం పార్వతిబాయి, ప్రత్యేక అధికారి మధుసూదనచారి, తహసీల్దార్ కూనాల గంగాధర్, ఎంపీడీవో మహ్మద్ రియాజొద్దీన్, ఎంఈవో భూమారెడ్డి, వైద్యాధికారి శ్రీధర్‌రెడ్డి, పశువైద్యాధికారిణి నేహ, ఈజీఎస్ ఏపీవో మంజులారెడ్డి, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలు వేణుగోపాల్‌రెడ్డి, ఇర్ఫాన్, ఐకేపీ ఏపీఎం సుదర్శన్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు