విజయోత్సాహం

18 Aug, 2016 22:34 IST|Sakshi
విజయోత్సాహం
  • సంగారెడ్డి చేరిన ‘కిలిమంజారో’ బాలికలు
  • విద్యార్థులు, అధికారుల ఘన స్వాగతం
  • వినూత్న రీతిలో జాతీయ పతాకం ప్రదర్శన
  • సంగారెడ్డి మున్సిపాలిటీ/సంగారెడ్డి జోన్‌: ‘కస్తూర్భా’ ఖ్యాతి.. ఖండాంతరాలకు పాకింది. అతి సామాన్యమైన విద్యార్థులు.. అసమానమైన కీర్తిని సాధించారు. అష్టకష్టాల విద్యాభ్యాసంలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. అడ్వంచర్‌ సృష్టించారు. జిల్లా యంత్రాంగం ట్రెక్కింగ్‌ అడ్డంచర్‌ సంస్థ చేయూతతో కేజీబీవీ, సోషల్‌ వెల్ఫేర్‌, గిరిజన సంక్షేమ శాఖలకు చెందిన 16 మంది విద్యార్థులతో కలిసి ఈనెల 8న దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వత అధిరోహణకు వెళ్లారు.

    ఈనెల 14న 19,340 అడుగుల ఎత్తైన పర్వతాన్ని అధిరోహించి, జాతీయజెండాతో పాటు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటం, పూర్ణపై రూపొందించిన పోస్టర్‌ ఆవిష్కరించారు. తిరిగి గురువారం సాయంత్రం బృంద సభ్యులు సంగారెడ్డి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వాగత ఏర్పాట్లు చేశారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు జాతీయ జెండాల ద్వారా జేజేలు పలికారు.

    విద్యార్థులు ఓపెన్‌టాప్‌ జీప్‌ ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు. పటాన్‌చెరు మండలం చిట్కలూ బాలికల జూనియర్‌ కాలేజీకి చెందిన విద్యార్థులు ప్రత్యేకంగా 500 అడుగుల భారీ జాతీయజెండాతో బృందానికి స్వాగతం పలికారు. విద్యార్థులతో పాటు ఆర్వీఎం పీఓ యాస్మిన్‌భాషా, వివిధ శాఖల అధికారులు, కేజీబీలకు చెందిన ఎస్‌ఓలు, విద్యార్థుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పట్టణం అంటేనే తెలియని తమను ఖండాంతరాలకు పంపించిన కలెక్టర్‌తో పాటు అధికారులకు కృతజ్ఞతలు చెప్పారు.

మరిన్ని వార్తలు