-

కిరికిరి

19 Aug, 2016 22:49 IST|Sakshi
  • ‘డిజిటల్‌ కీ’ వ్యవహారం
  • కమిషనర్‌, ఎస్‌ఐలకు అందని ‘కీ’
  • సర్టిఫికెట్ల జారీలో తీవ్ర జాప్యం
  • దరఖాస్తుదారుల ఇబ్బందులు
  • జిల్లాలోని పలు ఠాణాల్లో ఇదే సమస్య

  • జోగిపేట: పోలీసు, మున్సిపల్‌ శాఖలకు డిజిటల్‌ కీ తలనొప్పులు పట్టుకున్నాయి. ఉన్నతాధికారుల నుంచి ‘కీ’ పర్మిషన్‌ రాకపోవడంతో ఈ సమస్య ఎదురవుతోంది. ఫలితంగా దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సర్టిఫికెట్లు, సెల్‌ఫోన్‌లు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు, టైటిల్‌ డీడ్‌ మిస్‌ అయితే.. వాటిని పొందాలంటే అవస్థలు పడాల్సిందే.

    ‘కీ’లేక కుదరని ధ్రువీకరణ
    సర్టిఫికెట్ల కోసం లబ్ధిదారులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటేఽ, వాటిని మండల పరిధిలోని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం వారంలో వాటిని జారీ చేయాల్సి ఉంటుంది. జోగిపేట ఎస్సైగా టి.శ్రీధర్‌ గత నెల 15వ తేదిన బాధ్యతలు చేపట్టారు. డిజిటల్‌ కీ కోసం ఆయన అర్జీ పెట్టుకున్నా ఇప్పటి వరకు రాలేదు. జోగిపేట సర్కిల్‌ పరిధిలోని పెద్దశంకరంపేట పోలీసుస్టేషన్‌కు కూడా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్సైది కూడా ఇదే పరిస్థితి. గత నెలలో బదిలీ అయిన చాలా మంది ఎస్సైలకు ఇదే సమస్య ఎదురవుతోంది. దీంతో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తుదారులు మీసేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.

    నగర పంచాయతీలో...
    నగర పంచాయతీ ద్వారా పొందే సర్టిపికెట్లన్నీ ముఖ్యమైనవే. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో నాన్‌అవెయ్‌లెబులిటీ సర్టిఫికెట్‌, వాటిల్లో మార్పులుచేర్పులు నగర పంచాయతీ ద్వారానే డిజిటల్‌ కీ  ద్వారా ధ్రువీకరిస్తారు. విదేశాలకు వెళ్లేవారికి తప్పనిసరిగా బర్త్‌ సర్టిఫికెట్‌ అవసరం. ఇలాంటి సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు పత్రాలు సకాలంలో జారీ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జూలై 12వ తేదిన కమిషనర్‌గా ఉన్న రవీందర్‌రావును పలు కారణాలతో కలెక్టర్‌ సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో జిల్లా ఆర్వీఎం పీఓ యాశ్మిన్‌భాషకు ఇన్‌చార్జి కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు గత నెల 29న రాష్ర్ట మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆగస్టు 4వ ఆమె బాధ్యతలు చేపట్టినా డిజిటల్‌ కీ అనుమతి రాకపోవడంతో అనేక సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిసింది.

    సర్టిఫికెట్‌ కోసం 15 రోజులుగా తిరుగుతున్నా..
    వెహికిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ పోయిందని జూలై 23న జోగిపేట మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటి వరకు సర్టిఫికెట్‌ రాలేదు. ఇదే విషయం ఎస్సైని అడిగితే డిజిటల్‌ కీ లేదని, కాబట్టి సర్టిఫికెట్‌ ధ్రువీకరించలేదని చెప్పారు. ఇంకా నెల పడుతుందన్నారు. - పొట్టిగల్ల కృష్ణ, డాకూర్‌ గ్రామం
     

మరిన్ని వార్తలు