'బాబు విధానాలతోనే విఘాతం'

13 Aug, 2016 19:12 IST|Sakshi
'బాబు విధానాలతోనే విఘాతం'

మందమర్రి: టీడీపీ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన నూతన సరళీకృత విధానాలతో ప్రభుత్వ రంగ పరిశ్రమలకు పెద్ద విఘాతం కలిగిందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. అప్పటి ప్రభుత్వం అవలంభించిన విధానాల ఫలితంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

శనివారం ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో సీఐటీయూ ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం నాలుగో మహాసభలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సింగరేణిని కాపాడుకోవచ్చని పలు ఉద్యమ సభల్లో కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు బానిసలుగా పనిచేస్తున్నారని, అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్.. గత పాలకుల కంటే వారిని కట్టు బానిసలుగా చూస్తున్నారని తెలిపారు.

ఓపెన్‌కాస్ట్‌లతో ఉత్తర తెలంగాణ భూమి పుండుగా మారి ఇక్కడ పర్యావరణం విధ్వంసానికి గురవుతోందన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే కొమురం భీమ్ జిల్లాలో బొందల గడ్డలు తప్ప ఏమీ ఉండవని అన్నారు. మహసభలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురిజాల రవీందర్‌రావు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పి.రాజారావు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు