పిట్ట కొంచెం..ఆట ఘనం

21 Jan, 2017 22:41 IST|Sakshi
పిట్ట కొంచెం..ఆట ఘనం
నేడు కూచిపూడి అరంగేట్రం చేయనున్న ఎనిమిదేళ్ల లక్ష్మీశృతి
వయసు ఎనిమిదేళ్లు..ప్రదర్శనలు 45
రాజమహేంద్రవరం కల్చరల్‌ : ‘అచట పుట్టిన చిరుకొమ్మైన చేవ’...మహిష్మతీపురాన్ని గురించి అల్లసాని పెద్దన చేసిన వర్ణన పూర్తిగా రాజమహేంద్రవరానికి అన్వయిస్తుంది. 2008 ఫిబ్రవరి 25న జన్మించిన బేతాళ శ్రీసాయి ముత్యలక్ష్మీశృతి ఇప్పటి వరకు 45 నృత్య ప్రదర్శనలలో పాల్గొంది. ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరం రివర్‌బే హోటల్‌లో యక్షగాన కంఠీరవ డాక్టర్‌ పసుమర్తి శేషుబాబు, కూచిపూడి నాట్యాచార్యుడు పసుమర్తి శ్రీనివాసులు, కళారత్న హంస అవార్డు గ్రహీత డి.రాజకుమార్‌ ఉడయార్, తదితర అతిరథ, మహారథుల మధ్య కూచిపూడి అరంగేట్రానికి ఈ చిన్నారి సిద్ధమవుతోంది.
ఎల్‌కేజీలో చూసిన డాన్స్‌ ప్రేరణ ఇచ్చింది
ఎల్‌కేజీ చదువుతుండగా ఆనం కళాకేంద్రంలో చూసిన ‘డాన్స్‌’పేరిట జరిగిన నృత్యప్రదర్శన చూసాక, నాట్యం నేర్చుకోవాలన్న ఆసక్తి లక్ష్మీశృతిలో చిగురించింది. ధవళేశ్వరానికి చెందిన శ్రీరాధాకృష్ణ సంగీత నృత్య కళాక్షేత్రలో కూచిపూడి నాట్యం నేర్చుకోసాగింది. తొలిసారిగా ఆనం కళాకేంద్రంలో ‘సంగీత నాట్యామృత సంభవం’ నృత్యరూపకంలో శ్రీకృష్ణునిగా నటించి, ప్రేక్షకుల కరతాళ ధ్వనులను అందుకుంది. విజయవాడ, హైదరాబాద్, కొత్తపేట తదితర నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. గోదావరి పుష్కరాల్లో నక్షత్రమాలికాచరిత్రం, శంకరవైభవం నృత్య రూపకాల్లో చక్కని అభినయనాన్ని ప్రదర్శించింది. అన్ని అంశాలలోను శిక్షణ పొందాక, ఆదివారం పూర్తిస్థాయి కూచిపూడి అరంగేట్రానికి లక్ష్మీశృతి సిద్ధమవుతోంది.
ఎన్నో పురస్కారాలు..ప్రశంసలు
శ్రీసద్గురు సన్నిధి, విశ్వం సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, శ్రీజ్ఞాన సరస్వతీ పీఠం, డ్రీమ్స్‌ కాన్సెప్ట్‌ స్కూల్‌ వేదికలపై లక్ష్మీశృతి నర్తించి, అవార్డులను అందుకుంది. ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరిగిన సంక్రాంతి సంబరాలు పోటీల్లో సైతం బహుమతులను గెలుచుకుంది. వృత్తిరీత్యా డాక్టరు కావాలని, ప్రవృత్తి రీత్యా కూచిపూడి నర్తకిగా ఎదగాలని ఈ చిన్నారి కోరుకొంటోంది.
మరిన్ని వార్తలు