లే అవుట్ లు

21 Mar, 2016 04:03 IST|Sakshi
లే అవుట్ లు

జిల్లాలో అడ్డగోలుగా ‘ప్లాట్ల’ దందా
రూ. కోట్లలో సర్కారు ఖజానాకు గండి
నిజామాబాద్,  కామారెడ్డిల్లో  లేఅవుట్ లేని ప్లాట్ల విక్రయాలు
పంచాయతీ, మున్సిపాలిటీ సిబ్బంది అండదండలతో..
పట్టింపులేని అధికార యంత్రాంగం
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనూ ‘మాయ’

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో ఎక్కడ చూసినా స్థిరాస్తి వ్యాపారం మళ్లీ జోరందుకుంటోంది. ఇంతకాలం మందకొడిగా సాగ గా... ఇటీవల మళ్లీ లేఅవుట్ల దందా మొదలైంది. కొంత పెట్టుబడి... నేతల అండ ఉంటే చాలు వ్యవసాయ భూములు నివేశన స్థలాలుగా మారిపోతున్నాయి. వ్యవసా య పొలాలను నివేశన స్థలాలుగా మారుస్తున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల అధికారులు, సిబ్బంది చేయి తడిపి రూ.లక్షల్లో ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకునే వారు నిజామాబాద్, కామారెడ్డి, సదాశివనగర్‌లతో పాటు నిజామాబాద్-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన ప్లాట్లు చేస్తున్నారు. బైపాస్‌రోడ్డు ప్రారంభం కావడంతో ఈ రోడ్డు చుట్టూ నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు వెలుస్తున్నాయి.

ఎక్కడపడితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ లేఅవుట్‌లు వెలుస్తున్నాయి. ఆకర్షణీయమైన పథకాలతో మధ్య తరగతి వాసులను ఆకట్టుకుంటూ వ్యాపారం సాగిస్తున్నారు. ప్రభుత్వానికి జమ చేయాల్సిన సొమ్మును రూ.కోట్లలో ఎగ్గొడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో అధికారులు ‘అమ్యామ్యాలు’ పుచ్చుకుంటూ రియల్  ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్న భూములను వ్యవసాయ క్షేత్రాలుగా రిజిస్ట్రేషన్లు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూరుస్తున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు..
నిజామాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి పట్టణాల శివారులతో పాటు జిల్లాలో విచ్చలవిడిగా అక్రమ లే అవుట్‌లు వెలుస్తున్నా కనీస చర్యలు లేవు. గతేడాది జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ కామారెడ్డిని జిల్లా కేంద్రంగా ప్రకటించేందుకు సానుకూలంగా స్పందించడం కామారెడ్డి ప్రాంతంలో ఈ వ్యాపారానికి తెర  తీసినట్లయ్యింది. కామారెడ్డి-హైదరాబాద్ మధ్యన ఉన్న భూములకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కామారెడ్డి చుట్టూ అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి. నిజామాబాద్-కామారెడ్డి మధ్యన జాతీయ రహదారి పొడువునా మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నచోట కూడ లే-అవుట్లు ఏర్పాటు చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో నెల రోజుల వ్యవధిలో నాలుగు రియల్ ఎస్టేట్ సంస్థలు వెంచర్లకు తెరతీశాయి. నిజామాబాద్ నగర శివారులో ఓ బడానేత అండదండలతో అక్రమ నిర్మాణాలే కాదు అక్రమ వెంచర్లు కూడ వెలిశా యి. ఇలా జిల్లా వ్యాప్తంగా నెల రోజుల వ్యవధిలో 22 చోట్ల స్థిరాస్తి వ్యాపారం కోసం అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేయగా పంచాయతీ, నగర/పట్టణ పాలక సంస్థల అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో 1200 ఎకరాలకు పైగా అక్రమ లేఅవుట్‌లు వెలిసినట్లు అధికారవర్గాల అంచనా.

నిబంధనలను పాటించని వ్యాపారులు...
ప్లాట్ల వ్యాపారం చేస్తున్న వారు కనీస నిబంధనలను పాటించడం లేదు. లేఅవుట్ వేసేందేకు ముందుగా పంచాయతీ ఆమోదం, నగరాలు, పట్టణాల్లో మున్సిపాల్టీ తీర్మానం చేయాల్సి ఉంది. లేఅవుట్ వేస్తున్న భూమిని భూ మార్పిడి కింద (వ్యవసాయేతర వినియోగం) రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి పొందాలి. ఇందుకు గాను భూమి రిజిస్ట్రేషన్ విలువలో 10 శాతం సొమ్మును రుసుము కింద చెల్లించాలి. పదెకరాల్లో లేఅవుట్ వేస్తే దాని రిజిస్ట్రేషన్ విలువను బట్టి 10 శాతం రుసుము ఉంటుంది. ఉదాహరణకు ఎకరా రూ.30 లక్షలకు రిజిస్ట్రేషన్ చేయిస్తే... రూ.3 లక్షలు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. లేఅవుట్‌కు పట్టణ ప్రణాళిక విభాగం సంచాలకుని అనుమతి పొందాలి. లేఅవుట్ మొత్తం విస్తీర్ణంలో 10 శాతం స్థలాన్ని ప్రజోపయోగానికి వదిలివేయాలి. గ్రామ పంచాయతీ అయితే పంచాయతీకి, పట్టణాల్లో అయితే మున్సిపాల్టీలకు రిజిస్ట్రేషన్ చేయించాలి. అనుమతి పొందిన లేఅవుట్‌లో ప్రణాళికా విభాగం సూచించిన స్థలాన్నే ప్రజోపయోగానికి వదిలి వే యాలి. ఈ స్థలాల్లో సామాజిక భవనం, పాఠశాలలు, పార్కులు తదితర నిర్మాణాలు చేపట్టే వీలుంటుంది. కానీ ఎక్కడా వీటిని పాటించడం లేదు.

రూ.కోట్లలో ఎగవేస్తున్నరియల్ ఎస్టేట్ వ్యాపారులు...
జిల్లాలో ఎక్కడా నిబంధనలకు అనుగుణంగా లేఅవుట్‌లు చేసిన దాఖలాలు లేవు. ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లు గండి పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఆరు నెలల్లో దాదాపు 200 పైగా లేఅవుట్‌లు వెలిశాయి. ఈ భూమి ఎకరాకు కనీసం రూ.30 లక్షల వంతున విలువ రూ.300 కోట్లు. ఇందులో 10 శాతం రుసుము ప్రభుత్వానికి చెల్లించాలి. అంటే వ్యాపారులు, అధికారులు కూడబలుక్కొని రూ.30 కోట్ల వరకు ఎగవేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. లే అవుట్‌లలో 10 శాతం స్థలాన్ని కూడా వదల్లేదు. కొన్నింటికీ గ్రామ పంచాయతీల తీర్మానాలు, ఆమోదం లేవు.

నిజామాబాద్ శివారులో గ్రామీణ మండలం పరిధిలోని వేర్వేరు ప్రాంతాలలో అక్రమంగా సుమారు 50 ఎకరాల్లో అక్రమంగా 10 దాకా లేఅవుట్‌లు వెలిశాయి. అందులో చాలా వాటికి నగరపాలక సంస్థ, పంచాయతీల ఆమోదం లేదు.

కామారెడ్డి పట్టణంతో పాటు పట్టణ శివారులో జాతీయ రహదారికి ఇరువైపులా లేఅవుట్‌లు చేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. అటు మున్సిపాలిటీ, ఇటు సంబంధిత పంచాయతీ ఆమోదం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లా ఏర్పాటు కానుందన్న సీఎం హామీతో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ పుంజుకుంటోంది.

నిజామాబాద్ - డిచ్‌పల్లి బైపాస్ రోడ్డులో నిజామాబాద్‌లో బ్రిడ్జిని ఆనుకుని ఓ వెంచర్ వెలిసింది. ఈ వెంచర్‌లో పూర్తిగా కాల్వను ఆనుకుని చేశారు. పట్టాభూమిలోనే ప్లాట్లు ఏర్పాటు చేశామని చెప్తున్నా డీటీసీపీ నిబంధనలు తుంగలో తొక్కారు. రెవెన్యూ, మున్సిప ల్ అధికారులు ఇదేమీ పట్టించుకోవడం లే దు. జిల్లా వ్యాప్తంగా ఈ దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది.  

మరిన్ని వార్తలు