గండికోటలో చిరుత భయం

23 Jul, 2016 23:52 IST|Sakshi
గండికోటలో చిరుత భయం

జమ్మలమడుగు‌:
జమ్మలమడుగు మండలం గండికోట వాసులకు ఇప్పుడు మళ్లీ చిరుత భయం పట్టుకుంది. 2014 అక్టోబర్‌లో రెండు చిరుత పులులు సంచరిస్తూ గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. అంతేకాకుండా గ్రామంలో ఉన్న గొర్రెల కాపరులు  తమ గొర్రెలను  మెపుకునేందుకు కొండపైకి వెళ్లగా అక్కడ గొర్రెలు కనుమరుగవుతూ వచ్చాయి. మొదట గొర్రెలు ఏమవుతున్నాయో అర్థం కాక గొర్రెల
కాపరులు గుంపుగా ఏర్పడి పెన్నా నది లోయలో ఉన్న గుహల్లో వెతికారు. అక్కడ గొర్రెలకు సంబంధించిన పుర్రెలు కనిపించడంతో ఏదో జంతువు తిని ఉంటుందని భావించి రాత్రి పూట గొర్రెల మంద వద్ద కాపలా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో తమ కళ్ల ముందే చిరుత పులి గొర్రెలను తీసుకెళ్లడంతో ఈ సమాచారాన్ని ఫారెస్టు అధికారులకు ఇచ్చారు. అయితే ఫారెస్టు అధికారులు చిరుత లేదని,  కేవలం అపోహ మాత్రమేనని గొర్రెల కాపరుల మాటలను కొట్టి పారేశారు.

దాదాపు వందకు పైగా గొర్రెలు మృతి చెందాయని చిరుత పులులతో పాటు వాటి పిల్లలు కూడా ఉన్నాయని ఫారెస్టు అధికారులతో రైతులు గట్టిగా వాదించడంతో ఫారెస్టు అధికారులు రాత్రిపూట బీట్‌ వేశారు. వారు కూడా ప్రత్యక్షంగా చూసిన తర్వాత గండికోటలో చిరుత పులులు ఉన్నాయని నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత డెసెంబర్‌లో పులులను పట్టుకోవడం కోసం బోనులను ఏర్పాటు చేశారు. అందులో మూడేళ్ల వయసు కలిగిన ఆడ చిరుత చిక్కడంతో దానిని అధికారులు తిరుపతి అడవుల్లో వదిలి పెట్టారు. అప్పటి నుంచి మగ చిరుత, దాని పిల్లలు కొంత కాలం గండికోట, గండికోట కొట్టాలపల్లె, కొండ కింద ఉన్న తాడిపత్రి రహదారిలో సంచరిస్తూ వచ్చాయి. కొన్ని రోజుల పాటు హరిత హోటల్‌ సమీపంలో ఉన్న గొర్రెల మందపై పడి చంపేశాయి. ఆ తర్వాత కొద్ది కాలం చిరుత సంచారం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు  ఒకటిన్నర సంవత్సరం తర్వాత మళ్లీ చిరుత పులుల సంచారం గండికోట గ్రామస్తుల్లో భయాందోళన కలిగిస్తోంది. మూడు రోజుల క్రితం   ఒక్కసారిగా చిరుత పులి దాదాపు 20 గొర్రెలపై దాడి చేయగా అందులో 8 గొర్రెలు మరణించాయి.గండికోట సమీపంలో మగ చిరుత, దాని పిల్లలు సంచరిస్తున్నాయని చిరుత బారి నుంచి తమను కాపాడాలని ఫారెస్టు అధికారులకు గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు