నిస్సత్తువ

21 Feb, 2017 00:50 IST|Sakshi
నిస్సత్తువ
- కేజీబీవీ విద్యార్థినులను వేధిస్తున్న రక్తహీనత 
- 31 మందిలో ఏడు గ్రాముల కంటే  తక్కువగా హిమోగ్లోబిన్ శాతం 
- 8,130 మందిలో సాధారణం కంటే తక్కువ 
 
అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా పాఠశాలల విద్యార్థినుల్లో అధిక శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. కేజీబీవీల్లో చదువుతున్న అమ్మాయిల్లో సమస్య మరీ ఎక్కువగా ఉంది. తరచూ వైద్య పరీక్షలు చేసి.. రక్తహీనతను నివారించాల్సిన అధికారులు ఏమీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 6–18 ఏళ్ల బాలికల్లో హిమోగ్లోబిన్ శాతం 11.5 నుంచి 16 శాతం మధ్య ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. అమ్మాయిల్లో 12 ఏళ్లు మొదలుకుని 18 ఏళ్లు వచ్చేసరికి శారీరకంగా పలు మార్పులు జరుగుతాయి. హార్మోన్ల పనితీరు చురుగ్గా అవుతుంది. పీరియడ్స్‌ క్రమం తప్పకుండా వస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో వారు రోజూ పౌష్టికాహారం తీసుకోవాలి. హిమోగ్లోబిన్ శాతం తక్కువ కాకుండా చూసుకోవాలి. అయితే.. కేజీబీవీల విద్యార్థినుల పరిస్థితి చూస్తే ఆందోళన కలుగుతోంది. అనాథ, పేద, డ్రాపౌట్స్‌ బాలికల కోసం ఏర్పాటు చేసిన కేజీబీవీల నిర్వహణకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. వీటిల్లో చదువుతున్న బాలికలంతా నిరుపేదలే. వీరిని దృష్టిలో ఉంచుకుని పౌష్టికారంతో కూడిన ప్రత్యేక మెనూను రూపొందించారు. ఇది కచ్చితంగా అమలైతే రక్తహీనత సమస్యే ఉత్పన్నం కాదు. జిల్లా వ్యాప్తంగా 31 మంది కేజీబీవీ విద్యార్థినుల్లో ఏడు గ్రాముల కంటే తక్కువగా హిమోగ్లోబిన్ శాతం ఉంది. 
      8,130 మందిలో ఏడు కంటే పైన, సాధారణ కంటే తక్కువగా ఉంది. తరగతుల వారీగా చూస్తే ఏడు గ్రాములకంటే తక్కువ ఉన్న విద్యార్థినులు  ఆరో తరగతిలో తొమ్మిది మంది, ఏడులో ఐదుగురు, ఎనిమిదో తరగతిలో తొమ్మిది మంది, టెన్త్లో  ముగ్గురు ఉన్నారు. అలాగే 7–11 శాతం ఉన్న బాలికలు ఆరో తరగతిలో 1,640 మంది, ఏడులో 1,821 మంది, ఎనిమిదిలో 1,748 మంది, తొమ్మిదిలో 1,508 మంది, పదో తరగతిలో 1,413 మంది ఉన్నారు.  ఈ లెక్కలు చూస్తుంటే అమ్మాయిలకు పౌష్టికాహారం అందడం లేదనే విషయం స్పష్టమవుతోంది. ఆరో తరగతిలో కొత్తగా చేరిన అమ్మాయిల్లో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే వారు పదో తరగతికి వచ్చేసరికి నాలుగేళ్లు పూర్తవుతుంది. పౌష్టికాహారం అందించి ఉంటే ఆలోపైనా వారి పరిస్థితి మెరుగుపడేది. కానీ అలా జరగలేదు. నిర్వహణ బిల్లులు సక్రమంగా ఇవ్వలేదన్న సాకుతో మెనూకు మంగâýæం పాడుతున్నారు. దీనిపై సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ప్రాజెక్టు ఆఫీసర్‌ దశరథరామయ్యను వివరణ కోరగా.. విద్యార్థినుల్లో రక్తహీనత నివారణకు ప్రత్యేక కార్యక్రమం చేపడతామన్నారు. త్వరలోనే మరోసారి వైద్య పరీక్షలు చేయిస్తామని చెప్పారు. అలాగే మెనూ సక్రమంగా అమలు చేయని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.   
మరిన్ని వార్తలు