చెక్‌పోస్టు వద్ద లారీ అపహరణ

14 Aug, 2016 00:09 IST|Sakshi
  • చెక్‌పోస్టు వద్ద లారీ అపహరణ
  • బీవీపాళెం(తడ): ఒడిశా నుంచి చెన్నైకు ఐరన్‌ లోడుతో వెళ్లిన లారీ తిరిగి వెళ్లే క్రమంలో బీవీపాళెం చెక్‌పోస్టు వద్ద ఆగిన సమయంలో అపహరణకు గురైంది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. డ్రైవర్‌ రామ్మూర్తి, క్లీనర్‌ వెంకయ్య సమాచారం మేరకు..  ఒడిశా నుంచి లారీ(ఏపీ25 డబ్ల్యూ 5499)లో ఐరన్‌ రాడ్లు తీసుకుని శుక్రవారం చెన్నై వెళ్లారు. అక్కడ అన్‌లోడ్‌ చేసుకుని రాత్రి 12.10 ప్రాంతంలో బీవీపాళెం చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నారు. నిద్ర మత్తుగా ఉండటంతో టీ తాగి, సెల్‌ఫోన్‌కు రీచార్జ్‌ చేసుకునేందుకు లారీని రోడ్డు పక్కన ఆపి కిందకు దిగారు. కానీ  తాళాలు లారీలోనే ఉంచేయడంతో గమనించిన దుండగుడు లారీని తీసుకుని తడ వైపు వెళ్లారు. గమనించిన క్లీనర్‌ వెనుకనే వెంబడించగా లారీ తప్పించుకుంది. ఇంతలో పెట్రోలింగ్‌ తిరుగుతూ వచ్చిన తడ పోలీస్‌ వాహనాన్ని గుర్తించిన క్లీనర్‌ విషయం తెలపడంతో వారు అప్రమత్తమయ్యారు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. తడకు చేరుకుని తడలో శ్రీకాళహస్తి మార్గంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా లారీ 12. 20 సమయంలో తడ సర్వీస్‌ రోడ్డు మీదుగా శ్రీకాళహస్తి వైపు వెళ్లినట్టు గుర్తించారు. ఎస్‌ఐ సురేష్‌బాబు లారీ సిబ్బందిని వెంట బెట్టుకుని వరదయ్యపాళెం, సత్యవేడు ప్రాంతాల్లో అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించగా అక్కడ లారీ ఎంటర్‌ కాలేదని గుర్తించారు. ఈ రెండు ప్రాంతాలకు రాకుండా లారీ పారిపోయేందుకు ఉన్న మార్గాల్లో గాలింపు చేపట్టారు. మరో మార్గంలో నాగలాపురం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందన్న అనుమానంతో ఆ ప్రాంతంలో గాలిస్తున్నారు. శనివారం సాయంత్రం వరకు ఎటువంటి ఆచూకీ లభించలేదు. గతంలో చెక్‌పోస్టు పరిసరాల్లో లారీల అపహరణలు అధికంగా ఉన్నప్పటికీ కొంత కాలంగా తగ్గుముఖం పట్టాయి. కేవలం ఇన్నోవా కార్లు మాత్రమే అపహరించడం జరుగుతూ వస్తుంది.  దొంగలు మళ్లీ లారీలపై దృష్టి సారించడంతో పోలీసులు అప్రమత్తమవుతున్నారు.
మరిన్ని వార్తలు