రెండున్నర ఏళ్లలో రాష్ట్రానికి తీవ్ర నష్టం

7 Nov, 2016 23:52 IST|Sakshi
రెండున్నర ఏళ్లలో రాష్ట్రానికి తీవ్ర నష్టం
– కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
– పాతబస్తీలో ప్రజాబ్యాలెట్‌ నిర్వహించిన పీసీపీ చీఫ్‌ రఘువీరా
– కోట్ల సర్కిల్‌ వద్ద బహిరంగ సభలో ఫలితాలు వెల్లడి
 
కర్నూలు (ఓల్డ్‌సిటీ): రెండున్నర ఏళ్ల కాలంలో రాష్ట్రం చాలా నష్టపోయిందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. సోమవారం పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నేతృత్వంలో పాతబస్తీలో ప్రత్యేక హోదా, మేనిఫెస్టో హామీలపై ప్రజా బ్యాలెట్‌ నిర్వహించారు. అనంతరం కోట్ల సర్కిల్‌ వద్ద శాసన సభ మాజీ సభ్యుడు డాక్టర్‌ ఎన్‌.తులసిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ఓట్ల స్లిప్పులు లెక్కించి ఫలితాలు వెల్లడించారు. రఘువీరారెడ్డి సమక్షంలో భూపాల్‌నగర్‌కు చెందిన 50 మంది టీడీపీ యువకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ పది వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో కర్నూలుకు రైల్వే కోచ్‌ రిహాబిలేషన్‌ ఫ్యాక్టరీ తెస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఆ అవకాశం దక్కకుండా చేసిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 600కు పైగా హామీలు నెరవేర్చలేదని, ప్రజలంతా ప్రభుత్వానికి ప్రతికూలంగా ప్రజాబ్యాలెట్‌లో ఓట్లేశారని తెలిపారు. ప్రత్యేక హోదా తేవాలంటే కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ మాట్లాడుతూ.. చంద్రబాబు ఏ (అమరావతి) పీ (పోలవరం)కే పరిమితమయ్యారని చమత్కరించారు.
 
         డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్నారు. అన్ని పార్టీలు ముక్తకంఠంతో హోదాను కోరుకుంటుంటే, టీడీపీ–బీజేపీలు మాత్రం అవసరం లేదన్నట్లు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. మైనారిటీసెల్‌ రాష్ట్ర ఛైర్మన్‌ అహ్మద్‌ అలీఖాన్‌ మాట్లాడుతూ.. ముస్లింలపై చిత్తశుద్ధి ఉంటే పేద పిల్లల పెళ్లికి ముందే సాయం అందించాలే తప్ప పెళ్లి తర్వాత అప్లై చేసుకోవడమనేది విడ్డూరమన్నారు. చంద్రబాబుకు రెండున్నర ఏళ్ల తర్వాత ముస్లింలు గుర్తుకొచ్చారని విమర్శించారు. అనంతరం పార్టీ జిల్లా ఇన్‌చార్జిలు డాక్టర్‌ తులసిరెడ్డి, ఎస్‌.ఎ.సత్తార్, ప్రభాకర్‌లతో పాటు ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు నాగమధు, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, జడ్పీ మాజీ ఛైర్మన్‌ ఆకెపోగు వెంకటస్వామి, పీసీసీ కార్యదర్శి సర్దార్‌ బుచ్చిబాబు మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు శ్రీనివాసరెడ్డి, ఎస్‌.ఖలీల్‌ బాష, వై.వి.రమణ, చున్నుమియ్య, మజరుల్‌హక్, సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు