నేతల హామీలే రోడ్డున పడేశాయి | Sakshi
Sakshi News home page

నేతల హామీలే రోడ్డున పడేశాయి

Published Mon, Nov 7 2016 11:54 PM

నేతల హామీలే రోడ్డున పడేశాయి - Sakshi

కొంతమూరు జంగాల కాలనీలో విషాదం
రోడ్డున పడిన బాధితులు
నెరవేరని ఎమ్మెల్యే హామీతో తీరని నష్టం
 
గూడు కోసం తపించిన ఆ బడుగు జీవులకు పక్కా ఇళ్లు కట్టిస్తామని అధికార పార్టీ నేతలు ఇచ్చిన హామీ ఎన్నో ఆశలు కల్పించింది.  ఏళ్లు గడుస్తున్నా ఆ హామీ అంగుళం కూడా కదల్లేదు. ఇదిగో ఇళ్లు కట్టిచ్చేస్తామన్న వారి మాటలపై ఇంకా నమ్మకం సన్నగిల్లకుండానే.. పిడుగు పడ్డట్టుగా అగ్నిప్రమాదం వారి జీవితాలను బుగ్గిచేసింది.  కొంతమూరు జంగాల కాలనీలో సంభవించిన అగ్ని ప్రమాదం.. రాళ్లు కొట్టే కూలీలు, వ్యవసాయ కార్మికులైన కుటుంబాలను నడిరోడ్డున నిలబెట్టింది. ఇప్పుడు ఆ బడుగు జీవులు కూడు కోసం, నీడ కోసం తపిస్తున్నాయి. 
 
సాక్షి, రాజమహేంద్రవరం/ రాజమహేంద్రవరం రూరల్‌ : ‘వెంకటనగరం పైపులైన్‌  ఏర్పాటు చేసే స్థలంలో ఉన్న వారందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తాం. అప్పటి వరకు తాత్కాలికంగా ప్రభుత్వ స్థలం 1.20 ఎకరాల్లో మీ 128 కుటుంబాల వారు నివసించండి’ అంటూ రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కొంతమూరు జంగాలకాలనీ పేదలకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చి రెండేళ్లవుతోంది. ఇప్పటికీ పక్కా ఇళ్లు నిర్మించలేదు. పైగా తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్న ప్రాంతానికి ’బుచ్చయ్య కాలనీ’ అని తన పేరు కూడా పెట్టుకున్నారు. తమకు కేటాయించిన 32 గజాల స్థలంలో పేదలు అయినకాడికి అప్పు చేసి తాటాకిళ్లు నిర్మించుకున్నారు. ఎమ్యెల్యే హామీ నెరవేరుస్తారన్న ఆశతో రెండేళ్లుగా ఎదురు చూశారు. ఈ నెల 2న కొంతమూరులో జరిగిన జనచైతన్య యాత్రలో టీడీపీ జెండాలు చేతపట్టి, ఎమ్మెల్యే గోరంట్ల వెంట తిరిగారు. తమ సమస్యను మరోసారి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ఎప్పటి లాగే త్వరలో నిర్మిస్తామన్న మాటే వారికి వినిపించింది.
ఆ హామీ నెరవేర్చి ఉంటే..!
ఎమ్మెల్యే తన హామీ నెరవేర్చకపోవడంతో బుచ్చయ్య కాలనీ పేదలు ఇప్పుడు కట్టుబట్టలతో మిగిలారు. కాలనీలో మొత్తం 128 కుటుంబాలు ఉండగా, సోమవారం జరిగిన ఈ సంఘటనలో 95 కుటుంబాలకు చెందిన తాటాకిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇంట్లో ఉన్న దుస్తులు, సామగ్రి, వంట పాత్రలు, నగదు కూడా కాలిపోయింది. నిరాశ్రయులైన బాధితులు తలదాచుకోవడం కోసం, కడుపు నింపుకోవడం కోసం తల్లడిల్లుతున్నారు. మగవారు రాయి కొట్టడం, తాపీ పనులకు, మహిళలు ఇళ్లల్లో, వ్యవసాయ పనులకు వెళుతుంటారు. అలా కూడబెట్టిన సొమ్మంతా బుగ్గయింది. ఎమ్మెల్యే తన హామీ మేరకు పక్కా ఇళ్లు కట్టించి ఉంటే.. ఇప్పడు తమకు ఈ దుస్థితి ఉండేది కాదని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement