దేశాన్ని కాషాయీకరణ చేసేందుకు కుట్ర: పీసీసీ

15 Aug, 2016 20:26 IST|Sakshi

మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశాన్ని కాషాయీకరణ చేసేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని పీసీసీ ఉపాధ్యక్షులు మాదాసు గంగాధరం పేర్కొన్నారు. సోమవారం ఇందిర భవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మొదటి నుంచి లౌకిక వాదానికి కట్టుబడి ఉందన్నారు. కొన్ని స్వార్థశక్తులు తమ స్వలాభం కోసం కుట్రలు పన్నుతూ భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు.

 

ఆ నాడు దేశం కోసం పోరాడిన స్పూర్తితోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సి వస్తోందన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాల అమలు, ఏపీకి ప్రత్యేక హోదా కావాలని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు ప్రవేశ పెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు జాతీయ స్థాయిలో అన్ని పార్టీల వారు మద్దతు తెలపడం సంతోషకరం అన్నారు. బడుగు, బలహీన వర్గాల గుండెల్లో కాంగ్రెస్ పార్టీకి సుస్థిర స్థానం ఉందని, ఎన్ని కష్టాలు ఎదురైనా మున్ముందు పటిష్టం చేసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు, ప్రధాన కార్యదర్శులు జంగా గౌతం, గిడుగు రుద్రరాజు, ఉపాధ్యక్షులు సాకే శైలజానాథ్, ఎన్.తులసిరెడ్డి, సూర్యానాయక్, కిసాన్ సెల్ చైర్మన్ రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు