నరసన్నకు వైభవంగా మహాజ్యేష్టాభిషేకం

9 Jun, 2017 23:18 IST|Sakshi
నరసన్నకు వైభవంగా మహాజ్యేష్టాభిషేకం
సప్తనదీ జలాలతో అభిషేకం
పోటెత్తిన భక్తులు
అంతర్వేది (సఖినేటిపల్లి) : అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో శుక్రవారం స్వామివారి మూలవిరాట్‌కు సప్తనదీ జలాలతో మహాజ్యేష్టాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ వి.దేముళ్లు పర్యవేక్షణలో ట్రస్ట్‌బోర్డు సభ్యులు, ప్రధానార్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేదపండితుడు చింతా వెంకటశాస్త్రి ఆధ్వర్యంలో అర్చకులు ఈ అభిషేకాన్ని కనులు పండువుగా నిర్వహించారు. జ్యేష్ట మాసం శుద్ధపౌర్ణమి(జ్యేష్టా నక్షత్ర మహాపర్వదినం)సందర్భంగా ప్రాంతాలన్నీ సుభిక్షంగా ఉండాలని, శ్రీస్వామివారికి దివ్య తేజస్సు నిమిత్తం ఈ సప్త నదీ తీర్థ మహాజ్యేష్టాభిషేకం(సప్త నదీ జలాలతో అభిషేకం)చేశారు. మూలవిరాట్‌కు మహాజ్యేష్టాభిషేకం నిర్వహిస్తున్నంత సమయంలో భక్తులు స్వామిని భక్తి శ్రద్థలతో కొలుస్తూ భక్తి పారవశ్యంలో ఓలలాడారు. 
విష్వక్సేన పూజతో....
శ్రీవైఖానసాగమానుసారం శ్రీవైష్ణవ సంప్రదాయ ప్రకారం విష్వక్సేన పూజతో అర్చకులు మహాజ్యేష్టాభిషేకానికి శ్రీకారం చుట్టారు. ఈ అభిషేకానికి గంగా, యమున, సరస్వతి, వశిష్ట గోదావరి, నర్మదా, సింధు, కావేరి నదుల పవిత్ర జలాలను వినియోగించారు. స్థానిక భక్తులతో పాటు, వేర్వేరు ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని, స్వామిని కొలిచారు.
అర్చకస్వాములు దీక్షాధారణ....
మహాజ్యేష్టాభిషేకం పురస్కరించుకుని అర్చకులు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించి దీక్షాధారణ చేశారు. సప్తనదీ జలాలతో నింపిన కలశలకు, పంచామృతాలతో నింపిన కలశలకు అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అగ్నిమధనం చేసి, ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండంలో అగ్ని ప్రతిష్ఠాపన చేశారు.
పవిత్ర జలాల కలశలతో ప్రదక్షిణం...
మూలవిరాట్‌కు అభిషేకం చేసే పవిత్ర జలాల కలశలను ఆలయ ప్రధానార్చకుడు కిరణ్, అర్చకస్వాములు శిరస్సులపై ధరించి ఆలయ ప్రదక్షిణం చేసి, స్వామికి మహాజ్యేష్టాభిషేకం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రీతికరమైన తామరపూవులు, ఆవునెయ్యితో కలిపి ప్రధానార్చకుడు కిరణ్‌ మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం స్వామివారిని పూవులతో అలంకరించి విశేషార్చన, బాలభోగ నివేదన గావించారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ట్రస్ట్‌ బోర్డు సభ్యులు వీరా మల్లిబాబు, తిరుమాని ఆచార్యులు, యెనుముల శ్రీరామకృష్ణ, గంటా నాయుడు, ఎస్‌ శ్రీనుబాబు, ఆలయ పర్యవేక్షకుడు డి.రామకృష్ణంరాజు, సీనియర్‌ అసిస్టెంట్‌ జె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
>
మరిన్ని వార్తలు