సైకిల్‌ యాత్రను విజయవంతం చేయాలి

31 Jul, 2016 18:29 IST|Sakshi
సైకిల్‌ యాత్రను విజయవంతం చేయాలి

కందుకూరు: ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆగస్ట్‌ 2న జిల్లా స్థాయిలో చేపట్టనున్న సైకిల్ యాత్రను విజయవంతం చేయాలని సంఘం సౌత్‌ జిల్లా కార్యదర్శి ఎర్ర యాదగిరి కోరారు. ఆదివారం మండల కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మంగళవారం కందుకూరు మండల కేంద్రం నుంచి సైకిల్‌ యాత్రను ప్రారంభించనున్నామని, ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య కార్యక్రమానికి హాజరవుతున్నారని చెప్పారు. సైకిల్‌ యాత్ర ద్వారా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, కళాశాలలను సందర్శిస్తూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని చెప్పారు. అవసరమైతే సమస్యల పరిష్కారం కోసం రాష్ర్టవ్యాప్త ఉద్యమం చేస్తామని అన్నారు.

          ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు రెండు జతల దుస్తులు, అవసరమైన ఉపాధ్యాయులు, కనీస సౌకర్యాలు లేవని మండిపడ్డారు. సంక్షేమ వసతి గృహాల్లో బాలికలకు సరిపడు మరుగుదొడ్లు లేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు, మూడు హాస్టళ్లకు ఒక్కరే వార్డెన్‌ నియమించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ ఉద్యమ ఫలితంగానే 2012 సంవత్సరంలో హాస్టల్‌ విద్యార్థులకు కాస్మొటిక్‌, మెస్‌ చార్జీలు పెంచారని, మళ్లీ ఇప్పటి వరకు పెంచలేదన్నారు. ఎమ్మెల్యే, ఎంపీలు మాత్రం నెలకు లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చేపట్టే యాత్రలో విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గూడూరు భాస్కర్‌, సాయికృష్ణ, అంజి, సాయికుమార్‌, భాను తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు