‘మేడా’ ఆశలపై నీళ్లు

3 Apr, 2017 07:47 IST|Sakshi
‘మేడా’ ఆశలపై నీళ్లు
రాజంపేట: మంత్రివర్గ విస్తరణ తోటలో రాజంపేట శాసనసభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి గుభాళించలేకపోయారు. మంత్రి పదవిపై పెట్టుకున్న ఆయన ఆశలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీళ్లు చల్లారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఈయన ఒకరే ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లాలో పార్టీ బలోపేతం కోసం మొదటి ఏర్పడిన మంత్రి వర్గంలోనే చోటు కల్పిస్తారని భావించారు. అయితే​‍ ప్రభుత్వ విప్‌ పదవితో సరిపెట్టారు. ఈ సారి మంత్రి పదవి ఖాయమనే ప్రచారం విస్తృతంగా సాగింది. అయితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని వరించింది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వచ్చిన ఫలితాల నేప«థ్యంలో ఆది అనూహ్యంగా కేబినెట్‌లోకి దూసుకొచ్చారు. 
అసంతృప్తితో ...
జిల్లా తెలుగుదేశంలో పార్టీలో ఉన్న ఏకైక ఎమ్మెల్యేకి సీఎం చంద్రబాబునాయుడు కేబినెట్‌ విస్తరణలో మొండిచేయి చూపారు. రాత్రి పొద్దుపోయేంత వరకు మంత్రి వర్గంలో చోటు లభిస్తుందని ఎంతో ఆశతో ఎదరుచూశారు. తన వర్గానికి చెందిన వారిని విజయవాడకు రప్పించుకున్నారు. మ«ధ్యాహ్న నుంచి మేడాకు మంత్రి పదవి వస్తుందని అనుచరగణం ఊగిపోయారు. చివరకు చుక్కెదురు కావడంతో ఎమ్మెల్యే అసంతృప్తితో ఆదివారం విజయవాడ నుంచి నేరుగా బెంగళూరుకు వెళ్లినట్లు తెలిసింది. 
 
ఆనందంలో వ్యతిరేకవర్గం
నియోజకవర్గంలోని మేడా వ్యతిరేకవర్గం ఆనందంలో మునిగి తేలుతున్నారు. పార్టీ పరంగా ఆయనకు వ్యతిరేకంగా నివేదికలు వెళ్లినట్లు ఓ సామాజిక వర్గానికి చెందని నేతలు చెబుతున్నారు. 
 
విప్‌తో సరి...
2019 ఎన్నికలే టార్గెట్‌గా జరిగిన మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో మేడాకు విప్‌తోనే సరిపెట్టాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్న ఆయనకు ఈ పదవి వల్ల ఒరిగిందేమీ లేదు. కేవలం హోదా తప్ప మరేమీ లేదనే భావనలో ఉన్నారు. తనకు మంత్రి పదవి  వస్తే జిల్లాలో రాజకీయ ఎదుగుదలకు దోహద పడుతుందని ఆశించారు. కానీ ఆశలు ఫలించలేదు. ఇప్పటికే మాజీ మంత్రి బొజ్జల దారిలో జిల్లా అసంతృప్తి నేతలు రామసుబ్బారెడ్డి, మేడా మల్లికార్జురెడ్డి కొనసాగి తమ సత్తా చాటుకుంటారా? లేక సమయం వచ్చే వరకు పార్టీని అంటిపెట్టుకొనే ఉంటారా అనేది ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. 
మరిన్ని వార్తలు