మెడికో విద్యార్థినికి లైంగిక వేధింపులు

24 Oct, 2016 01:52 IST|Sakshi
- కానిస్టేబుల్‌పై క్రిమినల్‌ కేసు నమోదు, సస్పెన్షన్‌
 
నెల్లూరు(క్రైమ్‌): చట్టాన్ని రక్షించాల్సిన ఓ కానిస్టేబుల్‌ భక్షకుడి అవతారమెత్తాడు. ఓ మెడికో విద్యార్థినిని లైంగికంగా వేధించడంతో పాటు నగదును డిమాండ్‌ చేశాడు. లేని పక్షంలో పరువుతీస్తానని బెదిరించారు. దీంతో బాధిత మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు సదరు కానిస్టేబుల్‌పై బాలాజీనగర్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. ఇందుకూరుపేటకు చెందిన గోపీ బాలాజీనగర్‌ పోలీస్‌స్టేషన్లో రెండేళ్లుగా కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ రాత్రి ఇద్దరు మెడికో విద్యార్థులు ఎస్వీజీఎస్‌ కళాశాల సమీపంలోని పద్మావతి లేఅవుట్‌ వద్ద కారులో ఉన్నారు. విషయాన్ని గమనించిన కానిస్టేబుల్‌ గోపీ వారి వద్దకు వెళ్లి ఫొటోలు తీశారు. బెంబేలెత్తిన విద్యార్థులు అక్కడి నుంచి కారును ఆన్‌చేసి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా గోపీ అడ్డుకున్నారు. స్టేషన్‌కు పదండంటూ వారిని బెదిరించి వివరాలను సేకరించారు. తాను అడిగినంత ఇస్తే పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లనని చెప్పారు. గోపీ చేష్టలకు బెదిరిపోయిన విద్యార్థులు తమ వద్ద ఉన్న  కొంత నగదును కానిస్టేబుల్‌కు ఇవ్వడంతో అక్కడి నుంచి ఆయన వెళ్లిపోయాడు. పక్క రోజు కానిçస్టేబుల్‌ మెడికో విద్యార్థినికి ఫోన్‌ చేసి అధికమొత్తంలో నగదు డిమాండ్‌ చేశారు. లేదంటే ఫొటోలను తల్లిదండ్రులకు పంపుతానని బెదిరించాడు. ఇదే అదునుగా భావించిన గోపీ తన కోర్కె తీర్చాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. తనను వదిలేయమని ప్రాధేయపడినా అతను పట్టించుకోలేదు. వేధింపులను తాళలేని విద్యార్థిని జరిగిన విషయాన్ని, కానిస్టేబుల్‌తో మాట్లాడిన సంభాషణ ఆడియోను ఎస్పీ విశాల్‌గున్నీకి మెసేజ్‌ చేశారు. కానిస్టేబుల్‌  బారినుంచి తనకు రక్షణ కల్పించాలని అభ్యర్థించారు. స్పందించిన ఎస్పీ వెంటనే విచారించి కానిస్టేబుల్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేసి నివేదికను సమర్పించాల్సిందిగా బాలాజీనగర్‌ పోలీసులను ఆదేశించారు. బాలాజీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ రామారావు పూర్తిస్థాయిలో విచారించి కానిస్టేబుల్‌ గోపీపై శనివారం రాత్రి క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. అతడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంకా ఇలాంటి ఘటనలు ఏవైనా ఉన్నాయాననే కోణంలో విచారణను వేగవంతం చేశారు. గోపీపై క్రిమినల్‌ కేసు నమోదు విషయాన్ని బాలాజీనగర్‌ పోలీసులు గోప్యంగా ఉంచారు. ఈ ఘటన ఆదివారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు కానిస్టేబుల్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్లు సమాచారం.   
మరిన్ని వార్తలు