వేషాలేస్తే తాటతీస్తా... | Sakshi
Sakshi News home page

వేషాలేస్తే తాటతీస్తా...

Published Mon, Oct 24 2016 1:48 AM

వేషాలేస్తే తాటతీస్తా... - Sakshi

విలేకరికి ఎమ్మెల్సీ అన్నం సతీశ్ హెచ్చరిక
 
 సాక్షి, గుంటూరు/పాతగుంటూరు: అక్రమాలను ప్రశ్నిస్తే చాలు అధికారపార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. అడిగేవాడు ఉండడనే ధీమాతో దౌర్జన్యాలకు దిగుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ అన్నం సతీశ్ ప్రభాకర్ ఓ విలేకరిని తీవ్ర స్థాయితో బెదిరించారు. తాను పెద్దల సభలో సభ్యుడిని అన్న విషయం కూడా మర్చిపోయి.. పత్రికల్లో రాయలేని భాషలో ఆ విలేకరిపై విరుచుకుపడ్డారు. బాపట్ల మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ నిర్మాణంలో అక్రమాలపై ఆ విలేకరి సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నమే ఎమ్మెల్సీ ఆగ్రహానికి కారణం. వివరాలు ఇలా ఉన్నాయి..

 రూ. 70 లక్షలకు టెండర్లు.. రూ. 1.30 కోట్లు ఖర్చు
 బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో కూరగాయల మార్కెట్ నిర్మాణానికి రూ. 70 లక్షలతో టెండర్లు పిలిచి పనులు అప్పగించారు. తరువాత నిర్మాణ వ్యయాన్ని రూ. 1.30 కోట్లుగా ఖర్చు చూపారు. దీనిపై కౌన్సిల్‌లో తీవ్ర స్థాయిలో రగడ జరిగింది. నిర్మాణం చేసిన 17 షాపులకు రూ. 36 లక్షలతో మళ్లీ టెండర్లను పిలవడం టీడీపీ నేతల అధికార దుర్వినియోగానికి, అవినీతికి నిదర్శనమంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

 స.హ.చట్టం ద్వారా దరఖాస్తు..
 ఈ నేపథ్యంలోనే బాపట్లకు చెందిన 6 టీవీ రిపోర్టర్ చల్లా శ్రీనివాసరావు మార్కెట్ నిర్మాణాలు, అందులో జరిగిన అవకతవకలపై వివరాలు కోరుతూ బాపట్ల మున్సిపల్ కమిషనర్‌కు స.హ. చట్టం ద్వారా దరఖాస్తు చేశారు. గడువు ముగిసినా సమాచారం ఇవ్వకపోవడంతో మరోసారి అప్పీలు చేశారు. ఈ వ్యవహారం ఎమ్మెల్సీ అన్నం సతీశ్ ప్రభాకర్ దృష్టికి వెళ్లడంతో ఆయన శ్రీనివాసరావుకు ఫోన్ చేశారు. సమాచారం ఎందుకు అడిగావంటూ ప్రశ్నించారు. ‘ఏం తమాషాగా ఉందా.. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తా’ అంటూ బెదిరింపులకు దిగారు. అనంతరం బూతు పురాణం అందుకున్నారు. ఎమ్మెల్సీ బెదిరింపుల ఆడియోను శ్రీనివాసరావు సోషల్ మీడియాలో పెట్టారు.

 ఎమ్మెల్సీ వల్ల ప్రాణహాని
 ఎమ్మెల్సీ అన్నం సతీ్‌శ ప్రభాకర్ నుంచి తనకు ప్రాణ హాని ఉందని విలేకరి చల్లా శ్రీనివాసరావు భయాందోళన వ్యక్తం చేశారు. గుం టూరులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనకు ప్రాణభయం ఉండటంతో కలెక్టర్, అర్బన్, రూరల్ ఎస్పీ, సీఎం, గవర్నర్‌లకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు.

 విలేకరిపై కేసు నమోదు
 బాపట్ల: విలేకరి చల్లా శ్రీనివాసరావుపై బాపట్ల పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు. బాపట్ల మున్సిపల్ డీఈ సీతారామారావు, ఏఈ హసీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. విలేకరి తమను సమాచారం ఇవ్వాలని కోరడంతో పాటు పేపర్, టీవీకి యాడ్స్ రూపంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొనడంతో శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెల్లడించారు.

Advertisement
Advertisement