మరిచిపోలేని ఏడాది

31 Dec, 2016 22:52 IST|Sakshi
మరిచిపోలేని ఏడాది

కొత్తగా జిల్లా..డివిజన్‌ ఏర్పాటు

కోరుట్ల/జగిత్యాల : 2016..పరిపాలన పరమైన పెనుమార్పులకు జీవం పోసిన ఏడాదిగా నిలిచింది. కొత్త జిల్లా..డివిజన్‌..మండలాల ఏర్పాటుతో పాత జగిత్యాల డివిజన్‌ వాసులకు మరవలేని మధురక్షణాలను అందించింది. సుదూరంగా ఉన్న పాలనను అందుబాటులోకి తెచ్చింది. ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం ప్రతీ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వెసులుబాటు దక్కింది. దసరా సంబరాల్లోనే కొత్త జిల్లా ఏర్పాటు ఉత్సాహాన్ని నింపింది.

కొత్త జిల్లా..డివిజన్‌..మండలాలు
టీఆర్‌ఎస్‌ సర్కార్‌ మేనిఫెస్టోకు అనుగుణంగా ఏడాది కాలంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తులు చేసింది. చివరకు అంతా ఊహించిన రీతిలోనే జిల్లాగా పురుడుపోసుకుంది. జగిత్యాల జిల్లాను డెప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, ఎంపీ కవితలు దసరా రోజున ప్రారంభించారు. జిల్లా మొత్తం 18 మండలాలతో రెండు రెవెన్యూ డివిజన్లతో రూపుదిద్దుకుంది. నూతనంగా జగిత్యాల అర్బన్, బీర్‌పూర్, బుగ్గారం మండలాలు ఏర్పడ్డాయి. మూడు మున్సిపాలిటీలతో జగిత్యాల అతిపెద్ద జిల్లా కేంద్రంగా ఏర్పడింది. జనాభాలో 10 లక్షలతో 3044.23 విస్తీర్ణంతో జగిత్యాల జిల్లాగా ఆవిర్భవించింది. జిల్లాలో కొండగట్టు ఆలయంతో పాటు ధర్మపురి ఆలయం చేరింది. 50 కి.మీ పరిధిలో కరీంనగర్‌ జిల్లా విడిపోయి జగిత్యాల జిల్లాగా అన్ని మండలాలకు దగ్గరగా చేరుకుంది. కొత్తగా ఏర్పడిన జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల సేవలు అందుబాటులోకి వచ్చాయి.

కొత్త జగిత్యాల జిల్లా కేంద్రానికి చేరడానికి ఏ మండలం నుంచి అయినా కేవలం 40 కిలో మీటర్లు ప్రయాణిస్తే సరిపోతుంది. ఇంతకు ముందు కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి చేరుకోవడాని ధర్మపురి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌ వంటి దూరంగా ఉన్న     మండలాల ప్రజలు ఎంత తక్కువ అనుకున్నా 120 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. గతంలో ఉన్న జగిత్యాల డివిజన్‌లోని 14 మండలాల్లో అక్కడక్కడ ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు మరో నాలుగు మండలాలు బీర్పూర్, బుగ్గారం, జగిత్యాల రూరల్‌ మండలాలు ఏర్పాటు కాగా..వెల్గటూరును జగిత్యాల జిల్లాలో కలిపారు.


నిత్యం..అధికారుల సందడే: కొత్త జిల్లాలు విస్తీర్ణపరంగా చిన్నవి కావడంతో ప్రజలకు ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం అందుబాటులోకి వచ్చింది. గతంలో రెండు మూడు నెలలకు ఓ సారి కనిపించే కలెక్టర్, ఎస్పీ స్థాయి అధికారులు ప్రస్తుతం రోజు గ్రామాల్లో పర్యటిస్తూ పర్యవేక్షణ పరమైన భాద్యతల్లో మునిగి తేలుతున్నారు. జిల్లాస్థాయి అధికారులు ఒకే రోజు జిల్లాలోని సగం మండలాలను సులభంగా పర్యటించే అవకాశం ఉండటంతో ఎటు చూసినా అధికారుల హాడావుడి కనబడుతోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ శరత్, మెట్‌పల్లి రెవెన్యూ డివిజన్‌ కేంద్రంలో ముషారఫ్‌ అలీలు ఇద్దరు ఐఏఎస్‌లే కావడంతో కింది స్థాయి అధికార యంత్రాంగం పనితీరు చాలా మేర మెరుగుపడింది. మొత్తం మీద 2016 సంవత్సరం జిల్లా కేంద్రాన్ని..అధికార యంత్రాంగాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ప్రత్యేకతను సంతరించుకుంది.

మరిన్ని వార్తలు