అర్ధరాత్రి అరాచకం

28 Jun, 2016 11:32 IST|Sakshi
అర్ధరాత్రి అరాచకం

ఒంగోలు నగర వ్యాప్తంగా ద్విచక్ర వాహనాల దహనం
నాలుగు బైకులకు నిప్పంటించిన దుండగులు
మరో వాహన దహనానికి విఫలయత్నం
30 నిమిషాల్లో నాలుగు ఘటనలు..
పాత కక్షలా.. ఆకతారుుల ఆగడాలా?
ఈ తరహా ఘటనలు కొత్త కాదు..
నిందితుల కోసం ఖాకీల గాలింపు

ఒంగోలు క్రైం: నగరంలోని టూటౌన్, తాలూకా పోలీసుస్టేషన్ల పరిధిలో ఆదివారం అర్ధరాత్రి దుండగులు బీభత్సం సృష్టించారు. భాగ్యనగర్ యక్సిస్ బ్యాంక్ ఎదుట, అన్నవరప్పాడు నాలుగో లైన్, నిర్మల్ నగర్‌లో ద్విచక్ర వాహనాలనే లక్ష్యంగా చేసుకొని పెట్రోలు పోసి వాటిని దహనం చేశారు. అన్నవరప్పాడులో ఇంటి ముందు పార్కు చేసిన వాహనాన్ని తగులబెట్టారు. మిగతావన్నీ ఇంటి లోపల పార్కు చేసిన వాహనాలే. ఆయా వాహనాల్లోని పెట్రోల్ తీసి మరీ దహనం చేశారంటే కావాలని చేసిన అరాచకమా.. లేక ఆకతాయీల ఆగడాలా.. అన్నది పోలీసులకు సైతం అంతుబట్టడం లేదు. నగరంలో పలు ప్రాంతాల్లో ఒకే రోజు నాలుగు బైకులు దహనం కావడంతో ఇది ఒకే ముఠా పనా.. లేక వేర్వేరు ముఠాలా.. అన్నది తేలడం లేదు. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అప్పటికప్పుడు అప్రమత్తమై రంగంలోకి దిగినా ప్రయోజనం లేకపోయింది. 

ఎందుకంత కోపం?
టూటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలోని అన్నవరప్పాడులో రెండు ద్విచక్ర వాహనాలను పూర్తిగా తగులబెట్టారు. భాగ్యనగర్‌లోని యాక్సిస్ బ్యాంక్ ఎదుట హాట్ చిప్స్ పక్కనే కొబ్బరి బోండాల షాపు నిర్వహించే ఎం.వెంకటరెడ్డికి చెందిన నూతన ఎన్‌ఫీల్డ్ (బుల్లెట్) వాహనాన్ని పెట్రోల్ పోసి మరీ తగులబెట్టారు. రూ.1.60 లక్షలు వెచ్చించి ఈ ఏడాది ఏప్రిల్ 12న ఆ బైకును కొనుగోలు చేశారు. హాట్ చిప్స్ పక్కనే సందులో బుల్లెట్‌ను పార్కు చేశారు. దుండగులు తగుల బెట్టడంతో వాహనానికి సమీపంలో ఉన్న విద్యుత్ మీటర్ కూడా పూర్తిగా కాలిపోయింది. ఇది గమనించిన ఏటీఎం సెక్యూరిటీ గార్డులు గమనించి పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే వాహనం సగానికి పైగా కాలిపోయింది.

 అదే విధంగా అన్నవరప్పాడు నాలుగో లైన్‌లో సెంట్రింగ్ మేస్త్రీ తోటకూర రామారావుకుచెందిన మరో ద్విచక్ర వాహనం (ఫ్యాషన్)ను తగులబెట్టారు. ఈ వాహనాన్ని ఇంటి ముందు ఏర్పాటు చేసిన పందిరి కింద పార్కు చేశారు. దీనిని తగులబెట్టడంతో ఆపైనే ఉన్న విద్యుత్ సర్వీస్ వైర్లు కూడా కాలిపోయూరుు.

 రామారావు ఇంటికి ఎదుట చిల్లర కొట్టు నిర్వాహకుడు ఎన్.వెంకటేశ్వర్లుకు చెందిన మోపెడ్ వాహనం ప్రహరీ లోపల ఉంది. లోనికి ప్రవేశించిన దుండగులు ఆ వాహనంలోని పెట్రోల్ తీసి దాన్ని దహనం చేసేందుకు ప్రయత్నించారు. పక్కనే ఉన్న చీరను, టవల్‌ను ఆ వాహనంపై వేసి తగులబెట్టేందుకు పూనుకున్నారు. అక్కడ వృథా అయిన అగ్గిపుల్లలు కూడా చాలానే పడి ఉన్నాయి. ఎవరో వచ్చిన అలికిడి వల్లో లేక మరే కారణమో తెలియదుగానీ దాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయూరు.

ఒంగోలు తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలోని నిర్మల్‌నగర్ పార్క్ ఎదురు సందులో ఉన్న ఉప్పలపాటి ఆంజనేయులు ఇంట్లో పార్కు చేసిన రెండు ద్విచక్ర వాహనాలను పెట్రోల్ పోసి, ఆపై గన్నీ బ్యాగులు వేసి దహనం చేశారు. ఇంటి లోపల పార్క్ చేసిన వాహనాలను లక్ష్యంగా చేసుకొని మరీ తగులబెట్టారు. ఆ మంటలకు వాహనాల సమీపంలో ఉన్న విద్యుత్ స్విచ్ బోర్డు సైతం కాలిపోయింది.

ఇదేం కొత్త కాదు?
నగరంలో ఇలాంటి ఘటనలు కొత్తంకాదు. గతంలో అనేక సందర్భాల్లో బైకులను దుండగులు తగులబెట్టారు. నెల క్రితం ముంగమూరు రోడ్డులోని గాంధీ నగర్‌లో చిల్లర కొట్టు నిర్వహించుకుంటున్న వ్యాపారి తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి ముందు ఉంచితే ఎవరో దహనం చేశారు. భాగ్య నగర్ రెండో లైన్‌లోని రిజిస్టర్ కార్యాలయానికి సమీపంలో ఇంటి ముందు ఒకేచోట ఉన్న నాలుగు ద్విచక్ర వాహనాలను నిలువునా తగులబెట్టేశారు. అప్పట్లో ఈ కేసులో నిందితులను పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. ఇప్పుడు జరిగిన ఘటనలు మాత్రం పోలీసులకు సవాల్‌గానే మారింది. ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు దహనం చేయటంతో అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. అందుకు కారణమైన వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుల మేరకు ఆ రెండు పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు