అర్ధరాత్రి హల్‌చల్‌

11 Jul, 2017 22:14 IST|Sakshi
పోలీసులు తనిఖీ చేసిన కౌన్సిలర్‌ సుబ్బరాయుడు ఇల్లు
- నంద్యాలలో పోలీసుల అలజడి
-  కౌన్సిలర్‌ సుబ్బరాయుడు లక్ష్యంగా సోదాలు
- కౌన్సిలర్‌ ఇంటితో పాటు చుట్టుపక్కల ఇళ్లలోనూ తనిఖీలు
- భయభ్రాంతులకు గురైన విశ్వనగర్‌ వాసులు
- పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ నాయకుల నిరసన
 
నంద్యాల : నంద్యాలలోని విశ్వనగర్‌.. సోమవారం అర్ధరాత్రి 1.30 గంటలు.. అందరూ ఆదమరచి నిద్రపోతున్నారు. 65 ఏళ్ల వృద్ధురాలు నాగేశ్వరమ్మ ఇంటి ఆరుబయట నిద్రిస్తోంది. ఇంతలోనే సైరన్‌ మోగిస్తూ వచ్చిన పోలీసు వాహనాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. వాటిలో నుంచి దిగిన పోలీసు అధికారులు, సిబ్బంది చకచకా ఇంట్లోకి ప్రవేశించారు. ఇటీవలే టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన  18వ వార్డు కౌన్సిలర్‌ సుబ్బరాయుడును అదుపులోకి తీసుకున్నారు. ‘మీ ఇంట్లో ఆయుధాలు, ఓటర్లకు పంచడానికి రూ.5కోట్ల నోట్ల కట్టలు ఉన్నాయంటూ మాకు సమాచారం ఉంద’ని బెదిరించారు. ఇల్లు మొత్తం తనిఖీ చేశారు. దొరికిన డబ్బంతా తమతో పాటు పట్టుకెళ్లారు. కనీసం ఆరు నెలల పసివాడి పాలకు కూడా డబ్బు మిగిల్చలేదు. అలాగే  పక్కన ఉండే రజకుల ఇళ్లలోనూ సోదా చేశారు. కుటుంబ ఖర్చులకు కూడా డబ్బు మిగల్చకుండా తీసుకెళ్లారు. పోలీసుల హల్‌చల్‌ నేపథ్యంలో విశ్వనగర్‌ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
 
కౌన్సిలర్‌ సుబ్బరాయుడు పాల వ్యాపారంతో పాటు ఎలక్ట్రికల్‌ షాపును నిర్వహిస్తున్నారు. కాంట్రాక్ట్‌ పనులు కూడా చేస్తుంటారు. విశ్వనగర్‌లోని నాయీబ్రాహ్మణుల కాలనీలో సొంతింట్లో భార్య సుబ్బలక్ష్మమ్మ, తల్లి నాగేశ్వరమ్మ, ఆరు నెలల కుమారుడితో కలిసి నివాసముంటున్నారు. ఆయన ఇటీవల వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. అలాగే స్థానిక టీడీపీ నేత ప్రతాప్‌గౌడ్, మరికొందరిని పార్టీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేర్పించారు. దీన్ని టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులను ఉసిగొల్పి భయపెట్టాలని చూస్తున్నారు. కౌన్సిలర్‌ ఇంటిని తనిఖీ చేయడానికి డీఎస్పీ గోపాలకృష్ణ, టూటౌన్‌ సీఐ శ్రీనివాసులుతో పాటు దాదాపు 40మంది పోలీసులు వెళ్లడం గమనార్హం. ఆయన చిన్నాన్నలు సుబ్బరాయుడు, చిన్నసుబ్బరాయుడు, సుబ్బరాయుడు కుమారులు నాగేష్, నాగేంద్ర, కౌన్సిలర్‌ సొంత తమ్ముడు సురేష్‌ ఇళ్ల వద్దకు కూడా వెళ్లి.. వారిని నిద్రలేపి సోదా చేశారు. 
 
వైఎస్సార్‌సీపీలో ఎందుకు చేరావంటూ..
టీడీపీలో నుంచి వైఎస్సార్‌సీపీలోకి ఎందుకు చేరావని మఫ్టీలో ఉన్న పోలీసులు కౌన్సిలర్‌ సుబ్బరాయుడును బెదిరించారు. తాను శిల్పా అనుచరుడినని, ఆయన వెంటే ఉంటానని సుబ్బరాయుడు సమాధానం ఇవ్వడంతో ఆగ్రహం చెందారు. ‘నీ వార్డులో దాదాపు రూ.18లక్షల పనులు జరిగాయి. మరో రూ.20లక్షల పనులకు టెండర్లు జరుగుతున్నాయి కదా’ అని ఆరా తీశారు. 
 
రజకుల ఇళ్లలోనూ..
పగలంతా చాకిరేవులో దుస్తులు ఉతికి, రాత్రి ప్రశాంతంగా నిద్రపోతున్న రజకులు మద్దిలేటి, బాలమద్దిలేటిలను కూడా నిద్రలేపి ఇళ్లంతా సోదా చేశారు. తమకు ఎలాంటి రాజకీయాలూ తెలియవని, ఏనాడూ గొడవలకు, ఘర్షణలకు పాల్పడలేదని వారు ప్రాధేయపడినా పట్టించుకోలేదు. కౌన్సిలర్‌ సుబ్బరాయుడు ఇంట్లో ఆయన భార్య సుబ్బలక్ష్మమ్మ దాచుకున్న రూ.1.20 లక్షల పొదుపు డబ్బును,   స్థల విక్రయం, కాంట్రాక్ట్‌కు సంబంధించిన రూ.6.90లక్షల నగదును, రజకుల వద్ద నుంచి కూడా రూ.5.72 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 
 
 భయపెట్టారు–నాగేశ్వరమ్మ, సుబ్బరాయుడు తల్లి
 పోలీసులు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడటంతో ఉలిక్కిపడి లేచా. నీ కొడుకు దగ్గర కోట్ల డబ్బు, ఆయుధాలు ఉన్నాయి.. మేము ఇళ్లంతా చూడాలని బెదిరించారు. దీంతో తలుపులు తెరిపించారు. మా గురించి విశ్వనగర్‌ ప్రజలందరికీ తెలుసు. ఏ రోజూ ఎలాంటి దౌర్జన్యాలకూ దిగలేదు. కానీ నా కొడుకు సుబ్బరాయుడు పార్టీ మారాడని పోలీసులు దౌర్జన్యానికి దిగి మా పరువు తీయడం అన్యాయం. 
 
ఇలాంటి చర్యలకు భయపడం–సుబ్బరాయుడు, కౌన్సిలర్‌
అధికార పార్టీ నేతలు మమ్మల్ని బెదిరించి ఎన్నికల్లో వారి వైపునకు తిప్పుకోవడానికి పోలీసులతో సోదాలు చేయించారు. కానీ ఇలాంటి చర్యలకు భయపడేది లేదు. పాల వ్యాపారం, కాంట్రాక్ట్‌ కోసం దాచుకున్న డబ్బును కూడా తీసుకొని వెళ్లారు. ఏ పాపం ఎరుగని రజకుల డబ్బులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బు తిరిగిచ్చే వరకు న్యాయ పోరాటం చేస్తాం. 
 
మరిన్ని వార్తలు