నారాయణ.. ‘నారాయణ’!

3 Aug, 2016 23:24 IST|Sakshi
నారాయణ.. ‘నారాయణ’!
  • మంత్రి ఫోన్‌తో నిలిచిపోయిన టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు
  • ప్రారంభించిన కొన్ని గంటల్లోనే నిలిపివేత
  • అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకే..
  • నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపై చర్యలు నిల్‌
  • సాక్షి, గుంటూరు: హలో... ఎక్కడున్నారు.. ఎక్కడున్నా సరే వెంటనే రెస్క్యూ ఆపరేషన్‌ నిలిపివేసి వెనక్కి రండి.. ఇది ఫోన్‌లో డీటీసీపీ (డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌) నుంచి రెస్క్యూటీమ్‌ అధికారులకు వచ్చిన ఆదేశాలు. ఆరంభ శూరత్వంలో తమకు సాటి లేరని రాష్ట్రప్రభుత్వ పెద్దలు మరోసారి నిరూపించుకున్నారు. నెల్లూరు తరహాలో  గుంటూరు నగరంలో ఎక్కడికక్కడ ఆన్‌లైన్‌లో ఇచ్చిన భవన నిర్మాణ అనుమతులను తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన భవనాలపై చర్యలు తీసుకుంటాం... ఇందుకోసం నాలుగు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేశామంటూ ప్రగల్భాలు పలికిన మంత్రి నారాయణ, రాష్ట్ర పట్టణప్రణాళికాధికారులు నగరంలోని టీడీపీ నాయకుల ముందు తమ ఆదేశాలు ఏమాత్రం చెల్లవని అంగీకరించక తప్పలేదు. 
     
    పరిశీలన ఊసే లేదు..
    రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల నుంచి కొంతమంది అధికారులను ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లో సభ్యులుగా నియమించింది.   టాస్క్‌పోర్స్‌ బృందం బుధవారం నుంచి ఈనెల 6వ తేదీ వరకు న గరంలో 200 చదరపు మీటర్లు కలిగిన భవన నిర్మాణాలను మొదటి విడతగా దాదాపు 200 ఇళ్లను తనిఖీ చేయాలని నిర్ణయించారు.  ప్లాన్‌ ప్రకారం నిర్మాణాలు జరిగాయా? నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి చెల్లించవలసిన ఫీజు చెల్లించినదీ, లేనిదీ తదితర అంశాలను టాస్క్‌పోర్స్‌ సిబ్బంది తనిఖీ చేయాల్సి ఉంది. నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలు చేయకుంటే వాటిని కూల్చివేయాలని నిర్ణయించారు.   బుధవారం ఉదయం 7.30 గంటలకే నాలుగు టీమ్‌లు బయలుదేరి నగరంలోని నాలుగువైపులకు వెళ్లాయి. మధ్యాహ్నం వరకు తనిఖీలు చేశారు. అయితే అనుకోకుండా డీటీసీపీ నుంచి ఆపరేషన్‌ నిలిపివేయాలని ఆదేశాలు రావడంతో రెస్క్యూ టీమ్‌లోని అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. తనిఖీలు నిలిపివేసి వారివారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. 
     
    ఎన్నికలు వస్తున్నాయనే..
    వాస్తవానికి వందల సంఖ్యలో భవనాలను ఈ తనిఖీల్లో కూల్చివేయడం, లేదా నోటీసులు అందించడంతో పాటు జరిమానాలు విధించే అవకాశం ఉంది. నగరంలో తనిఖీలు ప్రారంభించిన వెంటనే టీడీపీ నాయకులు అప్రమత్తమయ్యారు. ఎక్కువగా టీడీపీ నాయకులు, వారికి కావాల్సిన వారే బిల్డర్లుగా ఉండటంతో వారు ప్రజాప్రతినిధులను ఆశ్రయించారు. ఇంకేముంది నగరంలో మరో మూడు నెలల్లో కార్పొరేషన్‌ ఎన్నికలు ఉన్నాయని, ఇటువంటి సమయంలో భవనాల జోలికి వస్తే పార్టీకి తీరని నష్టం ఏర్పడుతుందంటూ ప్రజాప్రతినిధులపై వత్తిడి తీసుకువచ్చారు. నగరంలో ఉన్న మంత్రి పుల్లారావు దృష్టికి ఇదే విషయాన్ని టీడీపీ నాయకులు  తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన ఆయన మంత్రి నారాయణ దష్టికి  విషయాన్ని తీసుకువెళ్లారు. నగరపాలకసంస్థ ఎన్నికల దృష్ట్యా రెస్క్యూ ఆపరేషన్‌ను నిలిపివేయాలని, ఏమైనా ఉంటే ఎన్నికల తర్వాత చూడవచ్చంటూ వత్తిడి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన మంత్రి నారాయణ రెస్క్యూ ఆపరేషన్‌ను నిలిపివేయాలని డీటీసీపీకి ఆదేశాలు జారీచేయడంతో ఆయన రెస్క్యూటీమ్‌ అధికారులకు ఆపరేషన్‌ నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో తనిఖీ ప్రక్రియ నిలిచిపోయింది. ఏది ఏమైనా నగరపాలకసంస్థ ఎన్నికలను అడ్డుపెట్టుకొని నగరంలో అ«నధికార భవనాలపై చర్యలకు టీడీపీ నాయకులు అడ్డుపడుతున్నారు. దీంతో ఏ నగరంలో లేని విధంగా అక్రమ కట్టడాలకు అడ్డగా గుంటూరు నగరం మారుతోంది.
మరిన్ని వార్తలు