ఆగస్టు 4న కార్మిక మంత్రి కార్యాలయం ముట్టడి

28 Jul, 2016 11:28 IST|Sakshi
గోడ పత్రికను ఆవిష్కరిస్తున్న సీఐటీయూ నేతలు
  • సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు 
  • శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 4న కార్మిక శాఖ మంత్రి  కింజరాపు అచ్చెన్నాయుడు కార్యాలయాన్ని ముట్టడించేందుకు సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాస్, డి.గోవిందరావులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం పట్టణం ఇందిరానగర్‌ కాలనీలోని సీఐటీయూ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికుల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిందన్నారు. అధికారం చేపట్టి రెండున్నరేళ్లు గడుస్తున్నా హామీ అమలు చేయలేదన్నారు. వేతన సవరణ గడువు పూర్తయి ఐదేళ్లు గడిచినా సవరించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేట్‌ యాజమాన్యాలు కుమ్మక్కై కార్మికుల కష్టాన్ని దోపిడీ చేస్తున్నాయని దుయ్యబట్టారు. జిల్లాలో పరిశ్రమలు మూతపడడం వల్ల వేలాది మంది కార్మికులు రోడ్డున పడినా కార్మిక మంత్రికి పట్టడం లేదని విమర్శించారు. మూసివేసిన పరిశ్రమలు తెరిపించకుండా అణువిద్యుత్‌ ప్లాంట్‌ వస్తే ఉపాధి కలుగుతుందని మంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.18వేలు చెల్లించాలని, వేతన అమలు సలహా బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని, 65వ షెడ్యూల్‌ పరిశ్రమలలో కనీస వేతనాలు పెంచాలని, కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్‌ఐ అమలు చేయాలని, కార్మిక చట్టాలు సవరణను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. మంత్రి కార్యాలయం ముట్టడికి పరిశ్రమలు, షాపులు, హోటళ్లు, ఇంటి పనివారు, జీడి, కొబ్బరి హమాలీ, మోటారు కార్మికులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్మికుల  డిమాండ్ల సాధనకు సంతకాల సేకరణ చేయాలని కోరారు. ఈ మేరకు గోడ పత్రికను ఆవిష్కరించారు.  
     
>
మరిన్ని వార్తలు