'ప్రలోభాల కారణంగానే పార్టీలు మారుతున్నారు'

25 Apr, 2016 19:10 IST|Sakshi

- ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఫిరాయింపుపై మంత్రి ప్రత్తిపాటి
- సీఎం చంద్రబాబు పడుతున్న కష్టం చూసి అంటూ మాట మార్పు


మంగళగిరి (గుంటూరు జిల్లా) : ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వెళుతున్నారో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వివరించారు. తెలంగాణలో ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రలోభాల కారణంగా తమ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వెళుతున్నారని, ఇక్కడ కూడా అంతేనని ఆయన వెల్లడించారు. నిజం బయటకు వచ్చేయడంతో తర్వాత నాలుక్కరుచుకుని ఇక్కడ రాష్ట్రాభివృద్ధికి తమ ముఖ్యమంత్రి 66 ఏళ్ల వయసులో పడుతున్న కష్టాన్ని చూసి.. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారంటూ మాట మార్చారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలో సోమవారం ఓ క్లినిక్ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ప్రలోభాల కారణంగానే ఎక్కడైనా ఎమ్మెల్యేలు పార్టీలు మారతారని చెప్పారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై గవర్నర్‌తో పాటు ప్రధాని, రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినా ఉపయోగం ఉండదన్నారు.

 

జూన్ చివరికి తాత్కాలిక సచివాలయం పూర్తి..
రాజధానిలో గ్రామ కంఠాలతో సహా అన్ని సమస్యలను మే నెలాఖరుకి పరిష్కరించి, రైతులకు ప్లాట్లు అందిస్తామని మంత్రి తెలిపారు. జూన్ చివరినాటికి తాత్కాలిక సచివాలయం పూర్తి చేస్తామని, రానున్న అసెంబ్లీ సమావేశాలు ఇక్కడే నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో డీఎస్పీ మధుసూదనరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు