వెయిటింగ్!

26 Oct, 2016 02:39 IST|Sakshi
వెయిటింగ్!

 పాలమూరు : రవాణా శాఖలో నూతన స్లాట్ల కోసం వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాల విభజన జరిగి 12 రోజులు గడిచినా అధికారుల పర్యవేక్షణ లోపంతో వాహనదారులకు నిరీక్షణ తప్పడంలేదు. గతంలో ఆర్టీఓ కార్యాలయాల్లోనే ట్రాన్స్‌ఫోర్టుకు సంబంధించిన లావాదేవీలు జరిగేవి. ఇతర నాన్‌ట్రాన్స్‌పోర్టుకు సంబంధించిన లావాదేవీలు ప్రాంతీయ రవాణా అధికారుల కార్యాలయంలో నిర్వహించేవారు. అయితే ఈనెల 11నుంచి జిల్లాల విభజన నేపథ్యంలో నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో అన్ని రకాల లావాదేవీలు ఎక్కడికక్కడే జరపాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ జిల్లాల విభజన జరిగి 12రోజులు గడుస్తున్నా చిన్నపాటి స్లాట్ల మార్పు ప్రక్రియను మార్చకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
 
   ఆగిన మీ సేవ
 మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ విభజన ప్రభావం పూర్తిగా మీ సేవ కేంద్రాలపై పడింది. దీంతో ఆన్‌లైన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆన్‌లైన్ ద్వారా వివిధ రకాల పనులు చేసుకోవాల్సిన ఆర్టీఏ వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మీ సేవ కేంద్రాల ద్వారా ఆర్టీఏ విభాగంలో 52రకాల సేవలు వాహనదారులు వినియోగించుకుంటున్నారు. ప్రతి స్లాట్ ఇక్కడి నుంచే బుక్ చేసుకోవాల్సి ఉండగా ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి రాకపోవడంతో వాహనదారులకు వేరే మార్గం లేక ఇబ్బంది పడుతున్నారు.
 
 స్లాట్ల కేటాయింపు ఇలా..
 ప్రతి జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి నాన్ ట్రాన్స్‌ఫోర్టు, ట్రాన్స్‌పోర్టు విభాగాలకు స్లాట్లు కేటాయిస్తారు. ఇందులో లెర్నింగ్ లెసైన్స్, లెసైన్సుకు సంబంధించిన లావాదేవీలు కొంత వరకు స్లాట్లు ఉన్నా మిగతా అన్ని రకాల లావాదేవీలకు స్లాట్లు లభించడం లేదు. లెసైన్స్‌కు సంబంధించిన 50వరకు స్లాట్లు ఉంటే మిగతా సామర్థ్య పరీక్షలకు, పర్మిట్‌లకు యాజమాన్య పేరు మార్పిడితో పాటు ఇతర అన్ని రకాల లావాదేవీలకు 50వరకు స్లాట్లు ఉన్నాయి. దీంతో రోజుల తరబడి నిరీక్షణ చేయాల్సి వస్తోంది. కేవలం ఆన్‌లైన్‌లో స్లాట్ల సంఖ్య పెంచితే సరిపోతుంది.
 
 మొదటి వారం వరకు అవకాశం
 
 ఉమ్మడి జిల్లాలో స్లాట్స్ బుక్ చేసుకున్న ప్రతి వాహనదారుడికి నవంబర్ మొదటి వారం వరకు అవకాశం కల్పించాం. ఈ సమయంలో ఎప్పుడు వచ్చిన వారి పని చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. కొత్త స్లాట్ బుక్ చేసుకోవడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు.      - మమత ప్రసాద్, డీటీసీ
 
 శాఖలో మధ్యవర్తులకు చెక్ పెట్టడంతో పాటు ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించడానికి అధికారులు అన్ని రకాల లావాదేవీలను ఆన్‌లైన్ చేశారు. దీంతో రవాణా శాఖలో ఎటువంటి లావాదేవీలను జరపాలన్నా మొదట ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పించిన అనంతరం ఒక తేదీని కేటాయిస్తారు. ఆ తేదీన సంబంధిత డీటీఓ కార్యాలయానికి వెళితే పని అయిపోతుంది. అయితే గతంలో దరఖాస్తు చేసుకుంటే రెండు మూడు రోజుల్లో తేదీని కేటాయించేవారు. ఇబ్బందులుండేవి కావు. ఇప్పు డు జిల్లాలో విజభనతో అన్ని రకాల లావాదేవీలకు ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవారికి 20రోజుల తర్వాత స్లాట్ వస్తుంది. దీంతో లావాదేవీలు మధ్యలోనే ఆగిపోయేలా ఉన్నాయి. అధికారుల తనిఖీల్లో సరైన పత్రాలు లేకపోవడంతో వాహనదారులకు జరిమానాలు తప్పేలా లేవు.
 

మరిన్ని వార్తలు