కన్నతల్లిని హత్య చేసిన కొడుకు

16 Aug, 2016 22:34 IST|Sakshi
  • జల్సాలకు డబ్బివ్వలేదని అఘాయిత్యం
  • ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం
  • బోయినపల్లి : జల్సాలకు డబ్బులు ఇవ్వడం లేదని కన్నతల్లిని హత్యచేశాడో కొడుకు. గొంతునులిమి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఈ సంఘటన మండలంలోని రామన్నపేటలో విషాదం నింపింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ముస్కు లత, రాజిరెడ్డి దంపతులకు విక్రంరెడ్డి, శ్రీవిద్య సంతానం. రాజిరెడ్డి ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లాడు. విక్రంరెడ్డి హైదరాబాద్‌లో ఉంటూ జులాయిగా తిరుగుతున్నాడు. శ్రీవిద్య తన అమ్మమ్మ ఇల్లైన వేములవాడ మండలం చెక్కపల్లి వద్ద ఉంటోంది. విక్రంరెడ్డి తరచూ స్వగ్రామానికి వచ్చి డబ్బులు కావాలని తల్లిని వేధించేవాడు. కొద్దిరోజుల క్రితం రామన్నపేటకు చేరిన ఆయన.. తల్లిని డబ్బుల కోసం వేధిస్తున్నాడు. దీనికి ఆమె అంగీకరించలేదు. ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తల్లిపై కక్ష పెంచుకున్న విక్రంరెడ్డి ఆదివారం రాత్రి లత (38)ను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం తలుపులు వేసి వెళ్లిపోయాడు. రెండురోజులుగా లత బయటకు రాకపోయేసరికి స్థానికులు తలుపు తెరిచి చూడగా శవమై పడి ఉంది. విషయాన్ని వెంటనే విక్రంరెడ్డికి ఫోన్‌ద్వారా చేరవేశారు. ఏమీ ఎరగనట్లు ఇంటికి చేరుకుని తల్లి శవం వద్ద రోదిస్తూ ఉండిపోయాడు. లత శరీరం ఉబ్బి ఉండడం.. పక్కన క్రిమిసంహారక మందు డబ్బా ఉండడంతో అందరూ ఆత్మహత్యగా అనుమానించారు. మంగళవారం ఉదయం సంఘటనస్థలానికి చేరుకున్న ఎన్‌ఐబీ సీఐ సర్వర్, చందుర్తి ఎస్సై కిరణ్‌కుమార్‌ విక్రంరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా తానే చంపినట్లు వెల్లడించాడు. భార్య హత్య విషయం తెలుసుకున్న రాజిరెడ్డి దుబాయి నుంచి వచ్చాడు. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో రాజిరెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైనీ ఎస్సై కోట సతీశ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు