అంగరంగ వైభవం నింగి నేలా సంబరం

7 Feb, 2017 00:09 IST|Sakshi
అంగరంగ వైభవం నింగి నేలా సంబరం

నయనానందకరం నరసింహుని కల్యాణం

అశేష భక్తుల మధ్య సాగిన దివ్య ఘట్టం

తన్మయత్వంతో తరించిన భక్తులు

అలవైకుంఠం ఇలకు దిగివచ్చిందా అన్నట్టు.. సర్వజగన్నియామకుడైన ఆ దేవదేవుని కల్యాణ వేళ.. అంతర్వేది పుణ్యక్షేత్రం దివ్యధామంగా శోభిల్లింది. రంగురంగుల విద్యుద్దీపాలు.. పరిమళాలు వెదజల్లే పూలమాలల అలంకరణలతో తీర్చిదిద్దిన ఆలయ ప్రాంగణంలోని కల్యాణ వేదికపై.. సర్వాభరణభూషితుడై కొలువుదీరిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం నయనానందకరంగా జరిగింది. సోమవారం అర్ధరాత్రి 12.21 గంటల సుముహూర్తానికి జరిగిన ఈ పరిణయ మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

సఖినేటిపల్లి : ఆదిదేవుడు అంతర్వేది లక్ష్మీ నసింహస్వామివారి కల్యాణం నయనానందకరంగా సాగింది. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, వేలాది మంది భక్తుల గోవింద నామస్మరణ మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి వేదికపై పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాల అలంకరణతో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. విష్వక్సేన పూజతో మొదలై, ఆగమశాస్త్ర ప్రకారం సంప్రదాయ పద్ధతిలో సాగిన ఈ వివాహ వేడుకను భక్తులు తన్మయత్వంతో చూసి తరించారు. 

అంతర్వేదిలో శ్రీలక్ష్మీనృసింహస్వామివారి కల్యాణం సోమవారం అర్ధరాత్రి 12.21 గంటలకు మృగశిర నక్షత్ర యుక్త తులా లగ్నపుష్కరాంశలో జరిగింది. వైష్ణవ సంప్రదాయబద్ధంగా వైఖానస ఆగమానుసారం ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్‌ ఆధ్వర్యంలో స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యుల పర్యవేక్షణలో ఆస్థాన వేదపండితులు చింతా వేంకటశాస్త్రి, అర్చక బృందం కల్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 
సుముహూర్తానికి జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని స్వామివారి శిరస్సుపై ప్రధాన అర్చకుడు కిరణ్, శ్రీదేవీ, భూదేవీ అమ్మవార్ల శిరస్సులపై సహాయ అర్చకులు ఉంచారు. కల్యాణ మండపం వద్ద నిర్మించిన భారీ షెడ్లలో భక్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆశీనులై స్వామివారి తిరు కల్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలతో పాటు, రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారి కల్యాణాన్ని కనులారా వీక్షించారు. కల్యాణాన్ని ఫ్యామిలీ ఫౌండర్‌ మెంబరు శ్రీరాజా కలిదిండి కుమార సత్యనారాయణ సింహజగపతి రాజా బహద్దూర్‌ స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలిచారు. కల్యాణం ఆద్యంతం భక్తుల గోవింద నామస్మరణతో కల్యాణ ప్రాంగణం మార్మోగింది.  కల్యాణ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.
ఎదురు సన్నాహంతో శ్రీకారం
రాత్రి 10 గంటలకు ఎదురు సన్నాహంతో కల్యాణ తంతు ప్రారంభమైంది. అనాదిగా వస్తున్న సంప్రదాయ ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన ఆలయ ఫౌండర్‌ ఫ్యామిలీ మెంబరు శ్రీరాజా బహుద్దూర్‌ శ్రీవారి తరఫున, అర్చకస్వాములు అమ్మవారి తరఫున వివాహకర్తలుగా నిలిచారు. ఆలయం నుంచి తొలుత స్వామిని, తరువాత అమ్మవార్లను వేదపండితుల మంత్రోచ్ఛారణ మధ్య అర్చకులు, అధికారులు, ట్రస్ట్‌బోర్డు, ఉత్సవ సేవా కమిటీ సభ్యులు పల్లకిలో వేర్వేరుగా కల్యాణం మండపం వద్దకు తోడ్కొనివచ్చారు. శ్రీవారు, అమ్మవార్లకు అంతర్వేదికరకు చెందిన పోతురాజు కుటుంబీకులు గతంలో ఇచ్చిన ఆభరణాలను అర్చకులు అలంకరించారు. కల్యాణం నిర్వహణలో ఆనవాయితీ ప్రకారం పేరూరు వేద పండితులు వచ్చి స్వామిని సేవించుకున్నారు. ఆనవాయితీగా స్వామికి తలంబ్రాలు బియ్యాన్ని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పొలమూరు కుటుంబీకులు తీసుకువచ్చారు. 
స్వామివారికి, అమ్మవార్లకు మధుపర్కాలు
కల్యాణానికి ముందు ప్రభుత్వ ప్రతినిధిలుగా......, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, రాజప్రతినిధిగా ఆలయ ఫౌండర్‌ ఫ్యామిలీ మెంబర్‌ శ్రీరాజా బహుద్దూర్, దేవాదాయశాఖ తరఫున డిప్యూటీ కమిషనర్‌..., టీటీడీ తరఫున...., అన్నవరం దేవస్థానం తరఫున పురోహితులు, గోదావరి డెల్టా కమిటీ చైర్మన్‌ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ, స్వామి, అమ్మవార్లకు మధుపర్కాలను సమర్పించారు. 
కల్యాణం తదనంతరం
కల్యాణం తదనంతరం ప్రముఖులు, విశిష్ట అతిథులు స్వామి, అమ్మవార్లకు నూతన వస్త్రాలను సమర్పించారు. వీరితో పాటు రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ, జెడ్పీ ఛైర్మన్‌ నామన రాంబాబు, మాజీ జెడ్పీఛైర్మన్‌... ఆర్డీఓ గణేష్‌కుమార్, డీఎస్పీ అంకయ్య స్వామి, అమ్మవార్లకు నూతన వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో.... పాల్గొన్నారు.
అలంకరణలతో కొత్త శోభ... 
స్వామివారిని, అమ్మవార్లను బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. సెటారీ, వైరుముడి, సూర్యపతకం, చిన్ని కిరీటం, వెండి కిరీటం, సాదా కిరీటం, కంటి, పచ్చలు, కెంపులు, వజ్రాలతో పొదిగిన కిరీటం, వజ్రాలు పొదిగిన హంస పతకం, నవరత్నాలు పొదిగిన హారం, పగడాల దండ, తొమ్మిది ఈస్ట్‌ ఇండియా మోహాళీలు, 12 రకాల నాన్‌తాడులు, చిన్ని లక్ష్మీకాసుల పేర్లతో వారిని అలంకరించారు.
నేడు రథోత్సవం
అంతర్వేది తీర్థమహోత్సవాల్లో భాగంగా మంగళవారం భీష్మ ఏకాదశి పర్వదినాన స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. నూతన వధూవరులుగా మూర్తీభవించిన శ్రీలక్ష్మీనృసింహ స్వామివారిని రథంపై అధిరోహింపజేసి, అసంఖ్యాకమైన భక్తుల నడుమ ఈ రథోత్సవం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.42 గంటలకు మెరకవీధి నుంచి మొదలయ్యే ఈ యాత్ర పల్లపు వీధిలోని పదహారు కాళ్ల మండపానికి చేరుకోవడంతో ముగుస్తుంది. ఆలయ ఫ్యామిలీ ఫౌండర్‌ మెంబరు శ్రీరాజా బహుద్దూర్, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, గోదావరి డెల్టా కమిటీ ఛైర్మన్‌ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ, ఆర్డీఓ గణేష్‌ కుమార్, ట్రస్ట్‌బోర్డు, ఉత్సవ సేవా కమిటీ సభ్యులు రథం వద్ద పూజలు నిర్వహించి రథయాత్రకు శ్రీకారం చుడతారు. ఈ యాత్రలో సోదరి అశ్వరూఢాంబికకు, స్వామివారు చీర, సారె ఇవ్వడం ఆనవాయితీ. స్వామి తరఫున ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్‌ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు వైభవంగా నిర్వహిస్తారు.
‘జనం’తర్వేది
భక్తులతో కిటకిటలాడిన పవిత్ర క్షేత్రం
అంతర్వేది(సఖినేటిపల్లి) : గోదావరి సప్తపాయల్లో ఒకటైన వశిష్టనది. సముద్రంలో సంగమ ప్రాంతం అంతర్వేది. బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న ఈ ప్రాంతం సోమవారం జనసంద్రమైంది. ఆదిదేవుడు శ్రీలక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు రెక్కలు కట్టుకుని వాలడంతో అంతర్వేది పుణ్యక్షేత్రం కిటకిటలాడింది. ఉదయం నుంచి భక్తుల రాక ఆరంభం కాగా, మధ్యాహ్నం నుంచి వారి సంఖ్య రెట్టింపైంది. మన జిల్లాతో పాటు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం, పాలకొల్లు, భీమవరం, మార్టేరు, ఏలూరు, తణుకు, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, అవనిగడ్డ తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. స్వామివారిని ఇలవేల్పుగా కొలిచే అంతర్వేదిపల్లిపాలెం వాసులకు కృష్ణా జిల్లాలోని పలుప్రాంతాల్లో బంధువులు ఉన్నారు. స్వామివారి మహోత్సవాలకు ఆయా జిల్లాల నుంచి మత్స్యకారులు అత్యధిక సంఖ్యలో హాజరయ్యారు. అలాగే ఆలయ క్షేత్రపోషకులుగా పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు రాజవంశీయులు వ్యవహరిస్తుండడంతో ఆయా ప్రాంతాల నుంచీ భక్తులు ఎక్కువగా హాజరుకానున్నారు. 

 

మరిన్ని వార్తలు