ముగిసిన నారాయణ్ఖేడ్ ఉప ఎన్నిక పోలింగ్

13 Feb, 2016 17:01 IST|Sakshi
ముగిసిన నారాయణ్ఖేడ్ ఉప ఎన్నిక పోలింగ్

మెదక్ : మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదయింది. గత సాధారణ ఎన్నికల్లో నమోదయిన పోలింగ్ శాతం కంటే ఎక్కువగా ఈ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం నమోదయింది. ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వద్ద బారులు తీరారు. జరుగుతున్నది ఉప ఎన్నికే అయినా  తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వాళ్లు ఉత్సాహం చూపారు. దీంతో 81.72 శాతం పోలింగ్ నమోదయిందని కలెక్టర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. ఈ నెల 16న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. విధుల్లో మరణించిన కానిస్టేబుల్ వీరాసింగ్ కుటుంబానికి ఎక్స్గ్రేషియా అందిస్తామని కలెక్టర్ చెప్పారు.


మరోవైపు భారీగా ఓటింగ్ నమోదు కావడంతో టీఆర్ఎస్ తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేసింది. భారీ మెజార్టీతో గెలుస్తామని ఆ పార్టీ శ్రేణులు ఆశాభావంతో ఉన్నారు. మరోవైపు నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నిక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాగా నారాయణ్ ఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎం.భూపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పట్లోళ్ళ సంజీవరెడ్డి, టీడీపీ నుంచి  ఎం.విజయపాల్ రెడ్డి బరిలో ఉన్నారు. కాగా గత సాధారణ ఎన్నికల్లో 2.5 లక్షల మంది ఓటర్లు ఉండగా 1.58 లక్షల ఓట్లు అంటే 79.64 శాతం ఓట్లు పోలయ్యాయి.

మరిన్ని వార్తలు