నీరివ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యం !

5 Mar, 2017 22:38 IST|Sakshi
నీరివ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యం !
-ప్రభుత్వానికి నెహ్రూనగర్‌ రైతుల అల్టిమేటం
-పురుగు మందు డబ్బాలతో ఆందోళన
-సీఎం, కలెక్టర్, మాండ్ర డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు
-చర్చలు జరిపిన ఆరీ​‍్డఓ, సీఐ 
ముచ్చుమర్రి(పగిడ్యాల):  రైతుల పరిస్థితి రోజు రోజుకు దుర​‍్భరంగా మారుతోంది.  కళ్లేదుటే నీళ్లున్నా పంటను తడుపుకోలేని  పరిస్థితి. ఈ దుస్థితికి  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరే కారణమని మండిపడుతున్నారు.  కేసీకి తక్షణం నీటి సరఫరాను పునరుద్ధరించకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామంటూ పురుగు మందు డబ్బాలు చేతపట్టుకుని ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆందోళన చేపట్టారు. పంప్‌హౌస్‌ వద్ద జరిగే పనులను నిలుపదల చేయించి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ శిలాఫలకం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మార్చి చివరి వరకు కేసీకి సాగునీరిస్తామని ఆరుతడి పంటలు వేసుకోవాలని సీఎం, కలెక్టర్, మంత్రులు, మాండ్ర శివానందరెడ్డి  చెప్పిన మాటలు నమ్మి మోసపోయామని   ఆగ్రహం వ్యక్తం చేశారు.  శ్రీశైలం రిజర్వాయర్‌ నీరు దిగువన ఉండే పంప్‌హౌస్‌లోకి రాకుండా ఆటంకంగా ఉన్న అడ్డుకట్ట బండరాళ్లను ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు.
 
ప్రాజెక్ట్‌ పూర్తి చేయకుండా ముఖ్యమంత్రి జాతికి ఎందుకు అంకితం చేశారని ధ్వజమెత్తారు. మొక్కజొన్న, మినుము, జొన్న వంటి ఆరుతడి పంటలు ప్రస్తుతం కంకి దశకు చేరుకున్నాయని, ఇప్పుడు నీరు కట్టుకోకపోతే  అవి చేతికి రావని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్నా నందికొట్కూరు సీఐ శ్రీనాథ్‌రెడ్డి ఎస్‌ఐలు లక్ష్మీనారాయణ, బాలనరసింహులును వెంటబెట్టుకుని ఆందోళన ప్రదేశానికి చేరుకుని రైతులతో  చర్చలు జరిపారు. జిల్లా స్థాయి అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టి సీఐతో విభేదించారు.
 
దీంతో స్పందించిన సీఐ జలవనరులశాఖ ఈఈ, ఎస్‌ఈ  తదితర ఉన్నతాధికారులకు ఫోన్‌లో సమస్యను వివరించారు. దీంతో  ఆర్డీఓ ఉసేన్‌సాహెబ్‌ హుటాహుటిన పంప్‌హౌస్‌ ప్రదేశానికి చేరుకొని రైతులతో మాట్లాడారు.   పంప్‌హౌస్‌లోకి నీరు వదిలితే   ఆయిల్‌, ట్రాక్టర్‌ ఇంజిన్ల సాయంతో  పంటలకు నీరు పెట్టుకుని కాపాడుకుంటామని  రైతులు ఆర్డీఓకు విన్నవించారు. దీనిపై ఇంజినీర్ల అభిప్రాయం తీసుకొని  సాయంత్రంలోగా నిర్ణయం వెల్లడిస్తామని ఆర్డీఓ చెప్పగా వారు ఒప్పుకోలేదు.  చివరకు తాను ఈ ప్రాంతవాసినని, పంటలు ఎండనివ్వమని ఆయన రైతులను ఆందోళన విరమింపజేసే ప్రయత్నం చేశారు.  మూడు పంటలకు నీరిస్తామని ముఖ్యమంత్రి, జిల్లా అధికారులు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని లేపోతే ఆత్మహత్యలు చేసుకునేందుకు కూడా వెనుకాడమని చెప్పారు.
 
మరిన్ని వార్తలు