ఇక కాంగ్రెస్ వంతు

13 Feb, 2016 04:25 IST|Sakshi
ఇక కాంగ్రెస్ వంతు

♦ పూర్తి స్థాయిలో బలోపేతమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ‘ఆకర్ష్’
♦ జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిపై అంచనా
♦ 2019 ఎన్నికల్లో ఏకఛత్రాధిపత్యం సాధించే వ్యూహం


 సాక్షి, హైదరాబాద్: పార్టీని సంస్థాగతంగా పూర్తిస్థాయిలో బలోపేతం చేయడంలో భాగంగా అధికార టీఆర్‌ఎస్ దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించుకుందా.., పార్టీ భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకునే ఆయా పార్టీల్లో సీనియారిటీ ఉన్న, తమ తమ నియోజకవర్గాల్లో జనామోదం ఉన్న నేతలకు గురిపెట్టిందా.. ఈ ప్రశ్నలకు టీఆర్‌ఎస్ వర్గాలు అవుననే సమాధానమే ఇస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరికలను ఆ పార్టీ ‘రాజకీయ పునరేకీకరణ’ అని ముద్దుగా పిలుస్తున్నా... ఇదంతా 2019 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సిద్ధం కావడమేనన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.

ఒక రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ఉంటే ఒకటే ఉండాలని, రెండు ప్రాంతీయ పార్టీల అవసరమే లేదన్న ఉద్దేశంతో టీడీపీ ఉనికే లేకుండా చేసిన గులాబీ నాయకత్వం... మరికొందరు కాంగ్రెస్ సీనియర్లపైనా వల విసిరే పనిలో ఉందని సమాచారం. పధ్నాలుగేళ్లపాటు సుదీర్ఘంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన టీఆర్‌ఎస్... రాజకీయ వ్యూహంలో భాగంగా ఎన్నికలు, పదవులకు రాజీనామాలు, ఉప ఎన్నికలు అంటూ పకడ్బందీగా వ్యవహరించింది. కానీ రాష్ట్రం సిద్ధించాక జరిగిన తొలి ఎన్నికల్లో మాత్రం సాధారణ మెజారిటీనే సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 60 స్థానాలుకాగా... 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అంతకు కేవలం మూడు సీట్లు ఎక్కువగా 63 స్థానాలను మాత్రమే గెలుచుకున్నది.

బీఎస్పీ విలీనం ద్వారా ఇద్దరు సభ్యులు కలిశారు. ఆ తర్వాత మెల్లమెల్లగా కాంగ్రెస్ నుంచి నలుగురు, వైఎస్సార్‌సీపీ నుంచి ఇద్దరు, తెలంగాణ టీడీపీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మొత్తంగా ప్రస్తుతం టీఆర్‌ఎస్ బలం 81 మంది ఎమ్మెల్యేలకు పెరిగింది. అయితే ఉద్యమ పార్టీగా అత్యధిక స్థానాల్లో గెలవాల్సిన టీఆర్‌ఎస్ ఆ ఎన్నికల్లో తాము ఓడిపోయిన స్థానాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టిందని... ఆయా నియోజకవర్గాల్లో అంతో, ఇంతో జనబలమున్న నేతలపై దృష్టి పెట్టిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిపై అంచనాకు వచ్చిన గులాబీ నాయకత్వం ‘ఆపరేషన్ ఆకర్ష్’కు మరింత పదును పెడుతోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
 
 టీడీపీ వాష్ ఔట్..!
 రాష్ట్రంలో టీడీపీ ఉనికి లేకుండా చేసే వ్యూహంలో భాగంగా ఇప్పటికే పదిమంది ఎమ్మెల్యేలను తమలో కలిపేసుకున్న టీఆర్‌ఎస్... వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే  కసరత్తు చేస్తోందని చెబుతున్నారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నాటి నుంచే జిల్లాల్లో పార్టీ బలం పెంచే పనిలో పడిందని... జీహెచ్‌ఎంసీ ఎన్నికల ద్వారా హైదరాబాద్‌లో కుదురుకుందని పేర్కొంటున్నారు. దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ చేతిలో సగం చొప్పున స్థానాలు ఉండడంపై అధికార పార్టీలో చర్చ జరిగిందని అంటున్నారు.

ఈ జిల్లాల్లోనూ పూర్తి ఆధిక్యం సాధించాలని, 2019 ఎన్నికలను టార్గెట్‌గా పెట్టుకోవాలని నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే కొందరు కాంగ్రెస్ సీనియర్లనూ పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. మహ బూబ్‌నగర్ జిల్లాలో ఒకరిద్దరు కాంగ్రెస్ నేతలతో, కరీనంగర్ జిల్లాలో మరో టీడీపీ నేతతో కూడా సంప్రదింపులు జరిపారని సమాచారం. కాగా తెలంగాణ టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లో చేరనున్నారని, ముహూర్తం ఖరారు కావాల్సి ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
 

మరిన్ని వార్తలు