నిర్వాసితులకు అండగా ఉంటాం : సీఎం

1 Feb, 2017 22:08 IST|Sakshi
నిర్వాసితులకు అండగా ఉంటాం : సీఎం
 ఏలూరు(మెట్రో) : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ముంపు గ్రామాలకు సంబంధించి నిర్వాసితులకు అన్ని సౌకర్యాలతో ఇళ్ల కాలనీలు నిర్మిస్తున్నామన్నారు. 22 వేల మంది నిర్వాసితులకు సంబంధించి వారి అంగీకారంతో అనువైన ప్రదేశంలో సకల సౌకర్యాలతో ఒక్కొక్క కాలనీలో 5 వేల ఇళ్ల సముదాయం ఉండే విధంగా నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇంకా మిగిలి ఉన్న భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్‌ మంత్రి దేవినేని ఉమ, కలెక్టర్‌ కాటంనేని భాస్కర్, జేసీ పులిపాటి కోటేశ్వరరావు, పోలవరం, గోపాలపురం, కొవ్వూరు ఎమ్మెల్యేలు మొడియం శ్రీనివాసరావు, ముప్పిడి వెంకటేశ్వరరావు, కేఎస్‌ జవహర్, ఇరిగేషన్‌ ఎస్‌ఈ రమేష్‌బాబు, స్పెషల్‌ కలెక్టర్‌ భానుప్రసాద్, ఐటీడీఏ పీవో షాన్‌మోహన్, రంపచోడవరం పీవో దినేష్‌కుమార్‌ పాల్గొన్నారు. 
మా బాబే.. ఏం చెప్పావు..!?  
పోలవరం ప్రాజెక్టు. ప్రాజెక్టు ఉన్న ప్రాంతం మాత్రం పోలవరం నియోజకవర్గంలోనిది. ప్రాజెక్టు ప్రాంతానికి వచ్చినా, ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చినా పోలవరం నిర్వాసితులు రావాలి. పోలవరం నియోజకవర్గ ప్రజలు రావాలి. కానీ ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నది, ముఖ్యమంత్రి హితబోధలు నేర్పింది మాత్రం దెందులూరు రైతులకు. దెందులూరు నియోజకవర్గ ప్రజలకు. సాక్షాత్తూ పోలవరం డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో రైతులనుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో రైతులు పామాయిల్‌ తోటలు పెంచుతారని, ఈ తోటల పెంపకంపై చూపే ఆసక్తి ఫామ్‌ఫాండ్స్‌పైనా చూపించాలని కోరారు. అంతేకాకుండా రైతులు అధిక దిగుబడి సాధిస్తున్నారా? అంటూ దెందులూరు రైతులనే ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ప్రాజెక్టు వల్ల నిర్వాసితులు అయ్యేవారితో ముఖ్యమంత్రి మాట్లాడింది  లేదు. ఇచ్చే నష్టపరిహారం అయినా, ప్యాకేజీ అయినా నిర్వాసితులకు సరిపోయిందా? అని ప్రశ్నించిన పాపాన పోలేదు. 
మరుగునపడిన మూలలంక 
పోలవరం ప్రాజెక్టు డంపింగ్‌ యార్డుగా ఉపయోగించే మూలలంక ప్రాంత రైతులు ఇటీవల నిరాహార దీక్షలు సైతం చేశారు. దెందులూరు నుంచి వచ్చిన రైతులను ప్రశ్నించారు తప్ప ప్రాజెక్టు సమీపంలో నష్టపోయే రైతులైన మూలలంక రైతులను ఏకోశాన పట్టించుకున్న పాపాన పోలేదు. 
మరిన్ని వార్తలు