నిధులు లేవు.. పనులు ఎలా చేయాలి?

4 Oct, 2016 19:46 IST|Sakshi

గ్రామసభలో సర్పంచ్‌ ఆవేదన

అల్లాదుర్గం: ‘గ్రామ పంచాయతీలకు నిధులు రావడం లేదు. గ్రామసభలు పెడితే ప్రజలు అడుగుతున్నారు. రూపాయి లేకుండా విద్యుత్‌ బిల్లుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులను తీసుకుంది. గ్రామంలో పనులు ఎలా చేయాలి’ అని అల్లాదుర్గం మండలం పల్వట్ల సర్పంచ్‌ ఆడిగే ప్రభాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పల్వట్లలో గ్రామసభ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలకు కోట్లాది రూపాయలు మంజూరు చేస్తామని, గతంలో గ్రామజ్యోతి ద్వారా పనులు వివరాలు, తీర్మానాలు తీసుకున్న ప్రభుత్వం నిధులను మాత్రం మంజూరు చేయలేదన్నారు. పంచాయతీలో నిధులు లేక కనీసం మురికి కాల్వలను తీయలేని పరిస్థితి నెలకొందన్నారు.

అధికారులు మాత్రం సమావేశాలు పెట్టి పారుశుద్ధ్యం పనులు చేయాలని చెబుతున్నారని, నిధులు ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మంజ్రేకర్, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు