ఉగాదికి తీపిలేదు!

7 Apr, 2016 03:09 IST|Sakshi
ఉగాదికి తీపిలేదు!

రేషన్ చక్కెరకు ప్రభుత్వం మంగళం
రెండు నెలలుగా విడుదలకాని కోటా
ఇప్పటికే కందిపప్పు ఆపేసిన సర్కారు

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పేద ప్రజలకు ఇది చే దు వార్త. చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే చక్కెరకు ప్రభుత్వం మంగళం పాడింది. ప్రతి కార్డుకు అరకిలో చొప్పున పంచ దార సరఫరా చేస్తున్న ప్రభుత్వం రెండు నెలలుగా పంపిణీని నిలిపివేసింది. మార్చి, ఏప్రిల్‌కు సంబంధించి 1,170 మెట్రిక్ టన్నుల చక్కెర కోటా రాకపోవడంతో తొలిపండగ ఉగాది పచ్చడిలో తీపికి అవకాశంలేకుండా పోయింది. జిల్లావ్యాప్తంగా ఉన్న 11.40 లక్షల రేషన్‌కార్డులకు ప్రతినెలా అరకేజీ చొప్పున 585 టన్నుల చక్కెరను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది.

అయితే, ఈ కోటాను గత రెండు నెలలుగా విడుదల చేయకపోవడంతో 120 టన్నుల బఫర్‌స్టాకును జిల్లా పౌరసరఫరాల శాఖ సర్దుబాటుచేసింది. కాప్రా, రామంతాపూర్, యాచారం, వికారాబాద్, పరిగి, ఘట్‌కేసర్, మహేశ్వ రం కేంద్రాల్లో ఉన్న నిల్వలను కార్డుదారులకు అందజేసింది. అయితే, తాజా పరిస్థితులను గమనిస్తే చక్కెరను కూడా ఎత్తివేసే అవకాశం కనిపిస్తోందని అధికారవర్గా లు అంటున్నాయి. ఇప్పటివరకు ప్యాకింగ్‌కు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టకపోవడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరాచేసే సరుకులను తగ్గించుకుంటూ వస్తున్న సర్కారు.. మూడు నెలలుగా కంది పప్పు పంపిణీ నిలిపివేసింది. తాజాగా పంచదారనూ   పక్కనపెట్టింది. ఈ నేపథ్యంలో కేవలం చౌక బియ్యం పంపిణీకే పరిమితం కానున్నట్లు అర్థమవుతోంది.

>
మరిన్ని వార్తలు