పాలమూరుపై కక్షసాధింపు

24 Sep, 2016 23:26 IST|Sakshi
జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌) : జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు చేపడుతున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆపేందుకు టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తోందని ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, అంజయ్యయాదవ్‌ విమర్శించారు. జిల్లాపై ఆ పార్టీ కక్షసాధిస్తోందని వారు ఆరోపించారు. శనివారం మహబూబ్‌నగర్‌లో విలేకరులతో వారు మాట్లాడుతూ 60ఏళ్లలో వలసల జిల్లాగా మార్చారన్నారు. 
 
అపెక్స్‌ కమిటీ సమావేశంలో ‘పాలమూరు’ను అడ్డుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వాదించగా సీఎం కేసీఆర్‌ తిప్పికొట్టారన్నారు. దీంతో వారి నిజస్వరూపం బయటపడిందని, ఇప్పటికైనా తెలంగాణ టీడీపీ నాయకులు జిల్లా ప్రజలవైపా.. ఆంధ్ర వైపా అని ప్రశ్నించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో సాగు, తాగు నీటిలో జిల్లాకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలను ఎమ్మెల్యేలు తిప్పికొట్టారు. వచ్చే ఏడాది మార్చినాటికి మన్యంకొండ సంప్‌హౌస్‌ను పూర్తి చేసి మహబూబ్‌నగర్‌ పట్టణానికి తాగునీరందిస్తామన్నారు. 
 శంషాబాద్‌వైపు ప్రజల మొగ్గు 
షాద్‌నగర్‌ నియోజకర్గ ప్రజలు శంషాబాద్‌ జిల్లాలోనే కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు. జిల్లా కేంద్రం అతి సమీపంలోకి రావడంతో అక్కడి ప్రజలు మహబూబ్‌నగర్‌ నుంచి విడిపోయేందుకు మొగ్గు చూపుతున్నారన్నారు. కుట్రలకు పెట్టింది పేరు ఆంధ్ర పాలకులని విమర్శించారు. ఈ సమావేశంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజేశ్వర్, టీఆర్‌ఎస్‌ నాయకులు రాజేశ్వర్‌గౌడ్, శివకుమార్, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు