అందని ‘ఆసరా’..!

28 Aug, 2016 20:03 IST|Sakshi
అందని ‘ఆసరా’..!
  • పింఛన్‌ రాక లబ్ధిదారుల తిప్పలు 
  • కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు 
  • పట్టించుకోని అధికారులు
  • ప్రభుత్వం విధించే కొన్ని నిబంధనలు ఒక్కొక్కసారి ప్రజల్లో ఎంత అసహనాన్ని పుట్టిస్తాయి అంటే నరాల్లోని రక్తం ఉడికే అంత. అసలే పండుటాకులు, పైగా సరిగ్గా నిల్చోలేని పరిస్థితి. ఆ దీన స్థితిలో ఉన్న వద్ధులను పట్టుకొని ‘‘నువ్వు బతికే ఉన్నావా? పింఛన్‌ నువ్వే తీసుకుంటున్నావా? మీ సేవా కేంద్రం నుంచి ధ్రువీకరణ పత్రాలు తేవాల్సిందే. లేకుంటే వచ్చే నెల సంది పింఛన్‌ రాదు’’. రెండు నెలల క్రితం వృద్ధాప్య పింఛన్‌ తీసుకుంటున్న లబ్ధిదారులకు అధికారులు విధించిన నిబంధన ఇది. ఈ నిబంధన కారణంగా లబ్ధిదారులు పడరాని పాట్లు పడ్డారు. చివరకు బతికే ఉన్నాం అంటూ బతుకు పోరు కొనసాగిస్తున్నారు. ఇది ఒక తీరు వ్యథ.. కొత్త పింఛన్లు మంజూరు కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ బతుకు జీవుడా అంటున్న మరికొందరివి కన్నీటి కష్టాలు
    ఆదిలాబాద్‌ అర్బన్‌ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఆసరా పథకం’ అర్హులందరికి అందడం లేదు. ఫలితంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆసరా పథకం అభాసుపాలవుతోంది. నెలనెల పింఛన్లు రాక లబ్ధిదారులు పడరాని పాట్లు పడుతున్నారు. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు మాత్రం కనికరించడం లేదు. అర్హులకు దక్కాల్సిన పింఛన్‌ సొమ్ము అనర్హులకు దక్కుతున్నాయనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు పింఛన్‌ అందించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినా అధికారులు నిర్లక్ష్యంతో ఆసరా పథకం లక్ష్యం నెరవేరడం లేదు.
    నూతన పింఛన్ల జాడే లేదు..
     ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతువులకు పింఛన్లు మంజూరు కాక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పింఛన్‌ అర్హులు ప్రతి సోమవారం గ్రీవెన్స్‌లో ఆసరా నివ్వండి సారూ అంటూ కలెక్టర్‌ను కలిసి అర్జీ పెట్టుకుంటున్నారు. ఇప్పటికి దాదాపు 3వేలకు పైగా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో జైనథ్, బేల, ఆదిలాబాద్‌ మండలాలకు కలిపి 20,587 వివిధ రకాల పింఛన్‌ లబ్ధిదారులు ఉన్నారు.
    నియోజకవర్గంలో పింఛన్లు ఇలా.. 
    ఆదిలాబాద్‌ నియోజకవర్గంలోని మూడు మండలాలకు కలిపి 20,587 వివిధ రకాల పింఛన్లు ఉన్నాయి. ఇందులో ఆదిలాబాద్‌ మండలంలో మొత్తం 6,420 పింఛన్లు ఉన్నాయి. ఇందులో వృద్ధాప్య పింఛన్లు 3,158, వితంతు 2,331, దివ్యాంగ పింఛన్లు 626, అభయ హస్తం పింఛన్లు 304తో పాటు ఒక కల్లుగీత పింఛన్‌ ఉంది. ఆదిలాబాద్‌ అర్బన్‌లో మొత్తం 6,077 పింఛన్లు ఉండగా, ఇందులోంచి వద్ధాప్య పింఛన్లు 3,191, వితంతు పింఛన్లు 2,096, దివ్యాంగుల పింఛన్లు 743, అభయహస్తం 47 పింఛన్లు ఉన్నాయి. బేల మండలంలో మొత్తం 3,050 పింఛన్లు ఉండగా, ఇందులోంచి 1,745 వృద్ధాప్య పింఛన్లు, 778 వితంతు, 266 దివ్యాంగుల పింఛన్లు, 261 అభయహస్తం పింఛన్లు ఉన్నాయి. జైనథ్‌ మండలంలో మొత్తం 5,040 వివిధ రకాల పింఛన్లు ఉండగా, వృద్ధాప్య పింఛన్లు 2,647 వితంతు పింఛన్లు 1,485, దివ్యాంగ పింఛన్లు 466, అభయహస్తం పింఛన్లు 442 ఉన్నాయి. వీరందరూ ప్రస్తుతం నెలనెల పింఛన్లు పొందుతున్నట్లుగా అధికారుల రికార్డుల్లో ఉంది. 
    లబ్ధిదారులకు తప్పనిపాట్లు 
    పింఛన్లు పొందడంలో అర్హులైన లబ్ధిదారులకు పాట్లు తప్పడం లేదు. పింఛన్‌ కోసం ప్రతి వారం దరఖాస్తులు చేసుకున్న ఫలితం ఉండడం లేదని అర్హులు ఆరోపిస్తున్నారు. ఇక ఇప్పటికే పింఛన్ల తీసుకుంటున్న లబ్ధిదారులు అధికారులు ఆన్‌లైన్‌ ప్రక్రియను ముడిపెట్టడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చేసేదేమి లేక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 
     
     
మరిన్ని వార్తలు