ప్రాణం తీసిన సెల్‌ఫోన్‌..

14 Sep, 2016 16:03 IST|Sakshi
ప్రాణం తీసిన సెల్‌ఫోన్‌..
నెల్లూరు రూరల్‌ : ట్రాక్టర్‌ ఆపి చార్జింగ్‌ పెట్టిన మొబైల్‌ ఫోన్‌ తీసుకుని రోడ్డు పక్కన నిలబడిన వ్యక్తిని అదే ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో మృతిచెందిన సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జొన్నవాడ రోడ్డులో పొట్టేపాళెం సమీపంలో చోటుచేసుకుంది. రూరల్‌ పోలీసుల సమాచారం మేరకు.. నెల్లూరు పొదలకూరు రోడ్డు సెంటర్‌కు చెందిన జి.వెంకటరమణ్య తన ట్రాక్టర్‌తో ఇసుక తీసుకువచ్చేందుకు పొట్టేపాళెం ఇసుకరీచ్‌కు బయలుదేరాడు. తోడుగా కుమారుడిని తీసుకెళ్లాడు. సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ తక్కువగా ఉండటంతో పొట్టెపాళెం పాత హరిజనవాడ సమీపంలోని మూడోమైలు (గుడితూము) వద్ద ట్రాక్టర్‌ను ఆపి, సమీపంలోని దుకాణంలో చార్జింగ్‌ పెట్టాడు.

ఇసుక రీచ్‌కు వెళ్లి ఇసుక లోడ్‌ చేసుకుని తిరిగి నెల్లూరు వైపు వస్తు పొట్టెపాళెంలో దుకాణం సమీపంలో ట్రాక్టర్‌ను రోడ్డుపక్కన ఆపాడు. చార్జింగ్‌ పెట్టిన సెల్‌ తీసుకుని వెంకటరమణయ్య రోడ్డుపక్కన నిలుచుని కొడుకును ట్రాక్టర్‌ నడపాలని సూచించాడు. తండ్రి సూచన మేరకు  కొడుకు ట్రాక్టర్‌ను ముందుకు తీశాడు. అదుపుతప్పిన ట్రాక్టర్‌ సెల్‌లో మాట్లాడుతున్న  వెంకటరమణయ్యను ఢీకొట్టింది. గోడకు, ట్రాక్టర్‌ ట్రాలీ ట్రక్కు మధ్యన ఇరుక్కుపోయిన వెంకటరమణయ్య(48) తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు రూరల్‌ పోలీసులకు సమాచారం అందించడంతో రూరల్‌ ఎస్సై సుబ్బారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించాడు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వార్తలు