గులాబీకి ‘ప్రాణ’ సంకటం!

11 Aug, 2015 02:16 IST|Sakshi
గులాబీకి ‘ప్రాణ’ సంకటం!

- కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం వేసేదేలా?
- ప్రాణహిత -చేవెళ్లపై విపక్షపార్టీల విమర్శనాస్త్రాలు
- డిజైన్ మార్పుపై అధికార పార్టీలో అస్పష్టత
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :
ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పు అంశం తెలంగాణ రాష్ట్ర సమితిని ఆత్మరక్షణలో పడేసింది. ఈ ప్రాజెక్టు కుదింపును రాజకీయాస్త్రంగా మలుచుకొని కాంగ్రెస్ దూకుడు కొనసాగిస్తుండడంతో గులాబీ దళంలో గుబులు మొదలైంది. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుపై విపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొలేక దాటవేత ధోరణిని అవలంబిస్తోంది. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చే సిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ప్రాజెక్టు పనులు కూడా చకచకా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన ప్రకటనను కాంగ్రెస్ అందిపుచ్చుకుంటోంది. పాలకపక్షాన్ని ఇరుకున పెట్టేలా వ్యూహాలకు పదునుపెట్టింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తో డీలా పడ్డ ఆ పార్టీ నాయకత్వం.. తొలిసారి చేవెళ్ల- ప్రాణహిత ప్రాజెక్టుపై సమష్టిగా పోరుబాట పట్టింది. ఓటమి తర్వాత దాదాపు ఇంటికే పరిమితమైన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రాజె క్టు కుదింపును ప్రతిష్టాత్మకంగా తీసుకొని టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు.

ప్రాజెక్టు నమూనా మారిస్తే సహించేదిలేదని హెచ్చరించడం ద్వారా రాష్ట్రస్థాయిలో చర్చకు తెరలేచింది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలోనూ ఆ పార్టీ మునుపెన్నడులేని విధంగా ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది. డిజైన్ మార్చారా? లేదా? అనే అంశంపై స్పష్టతనివ్వాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. ఒకవైపు సమావేశంలో తీర్మానానికి పట్టుబట్టడం.. మరోవైపు బయట పార్టీ శ్రేణులు జెడ్పీని ముట్టడించడంతో కాంగ్రెస్ వ్యూహం ఫలించిం ది. ప్రాజెక్టుపై తీర్మానానికి ససేమిరా అన్న మంత్రి మహేందర్‌రెడ్డి.. విపక్ష సభ్యులను అరెస్ట్ చేయించారు. ఈ అంశం కూడా తమకు లాభిస్తుందని కాంగ్రెస్ ఆశిస్తోంది.
 
అధికారపక్షంలో అస్పష్టత
ప్రాణ హిత ప్రాజెక్టుపై అధికారపక్షం పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. ప్రాజెక్టు నమూనా మార్పుపై ఇప్పటికే పలుమార్లు సీఎం సంకేతాలిచ్చినప్పటికీ, ఈ అంశంపై నోరుమెదిపేందుకు అధికారపార్టీగణం జంకుతోంది. డిజైన్ మార్చారని ఒప్పుకుంటే జనంలోకి వెళ్లలేమని బయపడుతున్న ఆ పార్టీ.. డిజైన్ మార్చలేదని చెప్పేందుకూ సాహసించడంలేదు. గోదావరి జలాలు చేవెళ్ల వరకు రావని కేసీఆర్ ఇదివరకే స్పష్టం చేసినందున.. ఏ ప్రకటన చేసినా గులాబీ బాస్‌తో చీవాట్లు తప్పవని భావిస్తోంది. ఈ ఇబ్బందే కాంగ్రెస్‌కు కలిసివచ్చింది.

‘తమ సభ్యులను బయటకు పంపాలా? సమావేశం వాయిదా వేయాలా? అనే అంశంపై మంత్రి కేటీఆర్‌తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకున్న మహేందర్‌రెడ్డి.. ఒకవేళ ప్రాజెక్టు డిజైన్ మార్చకపోతే ఎందుకు అరెస్ట్ చేయిస్తారు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు ప్రశ్నించారు. డిజైన్ మార్చుతున్నారు గనుకే కేటీఆర్ కూడా కాంగ్రెస్ సభ్యులను బయటకు పంపించాలని సలహా ఇచ్చిఉంటారన్నారు. కాంగ్రెస్ ముప్పేట దాడిని కొనసాగించడంతో డైలమాలో పడిన గులాబీ దళం.. విమర్శలకు దీటుగా సమాధానం చెప్పడానికి ప్రయత్నాలు ప్రార ంభించింది. అయితే, ప్రాజెక్టు నమూనాపై స్పష్టత లేకుండా ముందుకెలా సాగాలనే అంశంపై తర్జనభర్జన పడుతోంది.

మరిన్ని వార్తలు