జీరో చిట్స్‌తో జరభద్రం

11 Mar, 2017 02:46 IST|Sakshi
జీరో చిట్స్‌తో జరభద్రం

పుట్టగొడుగుల్లా వెలుస్తున్న చిట్టీల కంపెనీలు
సామాన్య, మధ్య తరగతి కుటుంబాలే టార్గెట్‌
అనతికాలంలో బోర్డు తిప్పేస్తున్న వైనం
రిజిస్ట్రేషన్‌ గ్రూపుల్లో చేరితేనే క్షేమం..


కాజీపేట అర్బన్‌ : సామాన్య మధ్యతరగతి కుటుంబాలు తమ నెలవారీ ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని పొదుపు చేసుకుని అవసరాలకనుగుణంగా వెచ్చించేందుకు చిట్స్‌ తోడ్పడుతాయి. అయితే కొన్ని చిట్‌ఫండ్‌ కంపెనీలు సామా న్య ప్రజల ఆర్థికావసరాలను ఆసరా చేసుకుని మోసానికి పాల్పడుతున్నాయి. చిట్స్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి గుర్తింపు పొందకుండా నిర్వహించే చిట్‌ గ్రూపులను జీరో చిట్స్‌గా పరిగణిస్తారు. ఇలాంటి వాటిలో చేరిన ప్రజలకు కంపెనీ బోర్డు తిప్పేసిన సమయంలో నగదును తిరిగి పొందే అవకాశం ఉండదు. కొందరు ఇంటికి వచ్చి పలువురిని పోగుచేసి చిట్టీలను నిర్వహిస్తారు. ఇవి కూడా జీరో చిట్స్‌కిందకే వస్తాయి.

చిట్స్‌ కంపెనీ గుర్తింపు ఇలా..
చిట్‌ఫండ్‌ కంపెనీ ఏర్పాటుకు ముందుగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ చిట్స్‌ కంపెనీ అనుమతి పొందాలి. పరస్పర అంగీకారంతో ఎంఓఏ (మెమోరాండం ఆఫ్‌ అసోసియేషన్‌),   పెట్టుబడి వివరాలను చార్టడ్‌ అకౌంట్‌ వద్ద అందించాలి. ఆర్టికల్‌ ఆఫ్‌ అసొసియేషన్‌లను పొందాలి. పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, లీస్‌ డీడ్‌లను ఏర్పాటు చేసుకుని సహాయక చిట్స్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అనుమతి పొందాలి. వంద శాతం నగదును ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చిట్టి గ్రుపుకు సంబందించి చేయాల్సి ఉంటుంది. స్థిరాస్తి తనఖాకు గాను 10లక్షల చిట్టీలకు రూ.15 లక్షల విలువైన ఆస్తిని తనఖా (మార్టిగేజ్‌) చేయాలి. స్థిరాస్తితో పాటు 50శాతం బ్యాంకు గ్యారంటీని కల్పించిన అనంతరం చిట్టీల గ్రూపులకు అనుమతిని సహాయక చిట్స్‌ కార్యాలయం అందిస్తుంది. ఇలాంటి గ్రూపులకు పీఏస్‌ఓ (ప్రివియస్‌ సాంక్షన్డ్‌ ఆర్డర్‌) నంబరును అందిస్తారు. వీటిని రిజిస్ట్రార్డ్‌ గ్రూపులుగా పరిగణిస్తారు. ఆపద కాలంలో కస్టమర్లు నగదును తిరిగి పొందే అవకాశం ఉంటుంది. నగరంతో పాటు ఉమ్మడి వరంగల్‌లో సూమారు 174 రిజిస్టార్డ్‌ చిట్‌ కంపెనీలు తమ బ్రాంచ్‌లతో సైతం సేవలను అందిస్తున్నారు.

రూ.48 లక్షల కోర్టు ఫీజుల రూపంలో ఆదాయం
చిట్‌ఫండ్‌ కంపెనీలలో తలెత్తే సమస్యల పరిష్కారానికి డిప్యూటీ రిజిస్ట్రార్‌ కోర్డినేటర్‌గా (మధ్యవర్తిగా) వ్యవహరిస్తారు. కస్టమర్లు, చిట్‌కంపెనీలు కోర్టు ఫీజును చెల్లించిన అనంతరం సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారు. డిసెంబర్‌ 31 ,2016 నాటికి సుమారు 48 లక్షల రూపాయలు కోర్టు ఫీజు రూపంలో ఖజానాకు ఆదాయం వచ్చిందంటే సమçస్యలు ఏవిధంగా ఉన్నాయో అర్థం అవుతుంది. అదే విధంగా చిట్స్‌ గ్రూపుల నిర్వాహణకు గాను 2శాతం చెల్లించే స్టాంప్‌ డ్యూటీతో సుమారు రూ.21లక్షల ఆదాయం గతేడాది లభించింది. నోట్ల రద్దుతో జీరో గ్రూపులు సైతం స్టాంప్‌ ఫీజును చెల్లించి గ్రూపులను రిజిష్ట్రర్‌ చేసుకునే అవకాశం ఉంది.

సామాన్య మధ్యతరగతి ప్రజలే టార్గెట్‌...
చిట్‌ కంపనీలు పుట్టగొడుగుల్లా వెలుస్తూ అనతికాలంలోనే బోర్డు తిప్పేస్తున్నాయి. కంపెనీని ప్రారంభించి మొదటి నాలుగు నెలలు కేవలం కస్టమర్లను చేర్పించే పనిలో నిమగ్నమై అనుకున్న డబ్బు సాధించిన అనంతరం బోర్డు తిప్పేస్తున్నారు. ఇటీవల నిట్‌ ఏరియాలోని హిమాన్వి చిట్‌ఫండ్‌ అదేబాటలో పయనించి రిజిష్టర్‌ గ్రూపులు లేక జీరో గ్రూపులలో చేర్పించుకుని ప్రజలకు టోపీ పెట్టింది. కస్టమర్లు సహాయక చిట్స్‌ కార్యాలయాన్ని ఆశ్రయించిన రిజిష్టర్‌ కాని గ్రూపులకు ఎలాంటి సహాయమూ అందించలేమని చెప్పడంతో ప్రజలు డబ్బులను కోల్పోతున్నారు.

మరిన్ని వార్తలు