డిజిటల్‌ సదుపాయాలతో 27 బిలియన్‌ డాలర్ల ఆదా - అజయ్‌సేథ్‌

23 Sep, 2023 07:25 IST|Sakshi

బోగస్‌ ఖాతాల ఏరివేత

కేంద్ర ఆర్థిక కార్యదర్శి సేథ్‌

న్యూఢిల్లీ: డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (డీపీఐ) వల్ల ప్రభుత్వ పథకాల అమలులో 27 బిలియన్‌ డాలర్లను (రూ.2.24 లక్షల కోట్లు) ఆదా చేయగలిగినట్టు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌సేథ్‌ ప్రకటించారు. అంతేకాదు స్వల్ప కాలంలోనే అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడంలో ఎంతో పురోగతి సాధించినట్టు చెప్పారు.

గత దశాబ్ద కాలంలో ప్రత్యక్ష నగదు బదిలీ వల్ల లకి‡్ష్యత లబ్ధిదారులను చేరుకోగలిగినట్టు, బోగస్‌ ఖాతాలను తొలగించినట్టు తెలిపారు. ఫలితంగా పన్ను చెల్లింపుదారుల ధనం పెద్ద ఎత్తున ఆదా అయినట్టు పేర్కొన్నారు. దేశంలో అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడంలో సాధించిన పురోగతిని అజయ్‌సేథ్‌ వివరించారు. బ్యాంకు ఖాతాల విషయంలో 20 శాతంగా ఉన్న విస్తరణను కేవలం 7–8 ఏళ్లలోనే 80 శాతానికి డీపీఐ సాయంతో పెంచినట్టు తెలిపారు. 

దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని వారికీ మెరుగైన సేవలు అందేలా పరిష్కారాలను అమలు చేసినట్టు చెప్పారు. 2014లో ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన ప్రారంభించగా, 50 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరుచుకున్నట్టు వెల్లడించారు. ఇందులో 56 శాతం మహిళలకు చెందినవిగా పేర్కొన్నారు. అలాగే, 67 శాతం ఖాతాలు గ్రామీణ, చిన్న పట్టణాల నుంచే ఉన్నట్టు తెలిపారు. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడంలో భారత్‌ తన జ్ఞానాన్ని, సాంకేతిక సామర్థ్యాలను ప్రపంచ దేశాలతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు సేథ్‌ ప్రకటించారు.

మరిన్ని వార్తలు