ఎర్రచందనంతో దొరికితే కఠిన చర్యలు

24 Jun, 2016 04:21 IST|Sakshi
ఎర్రచందనంతో దొరికితే కఠిన చర్యలు

బెయిల్ కూడా దొరకడం కష్టం
ఎర్రచందనం కేసు విచారణకు ప్రత్యేక కోర్టులు
సాక్షితో ఓఎస్డీ సత్య ఏసుబాబు

 సాక్షి,కడప: జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీ బి.సత్య ఏసుబాబు హెచ్చరించారు. గురువారం ఆయన సాక్షితో మాట్లాడారు. ప్రత్యేకంగా 1967 చట్టంలో కొన్ని సవరణలు చేశారని తెలిపారు.  అంతేకాకుండా ఇష్టానుసారంగా బెయిల్ ఇచ్చేందుకు కూడా వీలు లేదని.. ఒకవేళ బెయిల్ ఇచ్చేందుకు సిద్ధమైన పక్షంలో అటు పోలీసులు, ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే మధ్యంతర ఉత్తర్వులు కానీ, బెయిల్ పెట్టుకోవడానికి కూడా వీలు లేకుండా చట్టాన్ని కఠినతరం చేశారన్నారు.

గతంలో పరిస్థితి ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం త్వరితగతిన కేసులు పరిష్కారమయ్యే అవకాశంతోపాటు ఎక్కువ శాతం ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడిన వారికి శిక్ష పడే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా ఈ కేసుల విచారణకు ప్రత్యేకంగా స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు. అక్రమంగా తరలించినా, ఎర్రచందనం దుంగలు కొట్టివేస్తున్నా పదేళ్ల శిక్షతోపాటు రూ.10లక్షలు జరిమానా విధించేలా చట్టం వచ్చిందన్నారు.   మొదటిసారి తరలిస్తూ దొరికితే 5ఏళ్ల శిక్షతోపాటు రూ.3లక్షల జరిమానా, రెండవ సారి పట్టుబడితే ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5లక్షల జరిమానా విధిస్తారని ఆయన వివరించారు. ఎవరైనా వాహనంలో ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడంతోపాటు యజమానిపై కూడా కేసు పెడతామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు