కర్ణాటక సర్కార్‌కు ఉచితాల సెగ..

11 Sep, 2023 11:30 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర ప్రైవేట్ వెహికిల్స్ ఓనర్ అసోసియేషన్ బెంగళూరులో బందుకు పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి స్కీంకు వ్యతిరేకంగా ఈ బందుకు పిలుపునిచ్చినట్లు స్పష్టం చేసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు బంద్‌ను కొనసాగిస్తామని వెల్లడించింది. మొత్తం 32 ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్స్‌ ఈ బంద్‌లో పాల్గొన్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

బంద్‌కు కారణం..
ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం  శక్తి స్కీంను అమలుపరిచింది. దీని ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. దీని వల్ల తమ ఉపాధిపై దెబ్బపడుతోందని ప్రైవేట్ ట్యాక్సీవాలాలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోని బెంగళూరులో బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ఇతర ప్రయాణ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు విన్నవించారు.

ప్రధాన డిమాండ్‌..
బంద్‌ అమలుతో బెంగళూరులో ప్రైవేటు ట్యాక్సీలు, ఆటోలు, ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ బైక్ ట్యాక్సీలు కూడా అందుబాటులో లేవు. శక్తీ స్కీంను ప్రైవేటు బస్సులకు కూడా విస్తరించాలనేది యూనియన్ల డిమాండ్లలో ప్రధానమైనది. ప్రభుత్వ పథకంతో తమకు జీవనోపాధి లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వంతో అనేకమార్లు చర్చలు జరిపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని యూనియన్లు చెబుతున్నాయి. దాదాపు 10 లక్షల ప్రైవేట్ వాహనాలు నిలిచి ఉండనున్నాయి. 

ప్రభుత్వం చర్యలు..
బంద్‌తో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే నగరంలో వీలైనన్ని అధిక బస్సులను నడుపుతున్నామని రవాణా మంత్రి రామలింగా రెడ్డి స్పష్టం చేశారు. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.  నగరంలో దాదాపు 500 అధిక బస్సులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: జీ20 కేంద్రం వద్ద వర్షం నీరు.. విపక్షాల వ్యాఖ్యలపై కేంద్రం క్లారిటీ..

మరిన్ని వార్తలు